అయ్యో జూపల్లి! ప్రియాంక రాలేక.. దిల్లీలో చేరిక
దీంతో నేరుగా దిల్లీ వెళ్లి గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు
By: Tupaki Desk | 4 Aug 2023 8:53 AM GMTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ.. పార్టీ నుంచి బయటకు వెళ్లిన జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి.. వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.
కానీ 2018 ఎన్నికల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో పార్టీపై జూపల్లి అసంతృప్తితో కొనసాగారు. చివరకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అధిష్ఠానంపై విమర్శలు చేయడంతో సస్పెండ్ అయ్యారు.
అప్పటి నుంచి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపారు. దిల్లీ వెళ్లి మరీ అగ్ర నాయకులను కలిశారు. ఈ నేపథ్యంలో గత నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అదే సభలో జూపల్లి కూడా కాంగ్రెస్‌లో చేరతారనుకుంటే ఆయన అందుకు ఒప్పుకోలేదు.
తన సొంత నియోజకవర్గం కొల్లూరులోనే భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలనుకున్నారు. జులై 20న సభ పెట్టి ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని భావించారు. కానీ ఆ సభ వాయిదా పడింది.
అయినా పట్టువిడవని జూపల్లి 30న సభ పెట్టాలని చూశారు. కానీ భారీ వర్షాల కారణంగా అప్పుడూ కుదరలేదు. చివరకు ఆగస్టు 5న సభ పెడదామనుకున్నా.. ప్రియాంక గాంధీ రావడానికి వీల్లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో నేరుగా దిల్లీ వెళ్లి గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
జూపల్లితో పాటు కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి, వనపర్తి నాయకుడు మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితర నేతలూ కాంగ్రెస్‌లో చేరారు. మొత్తానికి కొల్లూరులో సభ పెట్టి తన బలాన్ని చాటుకుందామనుకున్న జూపల్లికి నిరాశే ఎదురైంది. కానీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన సభ పెట్టాలనే పట్టుదలతోనే ఉన్నట్లు తెలిసింది.