Begin typing your search above and press return to search.

విచారణ వేళ నాలుక మడతేసిన ట్రూడో.. ఆరోపణలే.. ఆధారాల్లేవట!

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల్ని సైతం పణంగా పెట్టిన కెనడా ప్రధాని వైఖరి తాజాగాబయటకు వచ్చిందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:10 AM GMT
విచారణ వేళ నాలుక మడతేసిన ట్రూడో.. ఆరోపణలే.. ఆధారాల్లేవట!
X

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల్ని సైతం పణంగా పెట్టిన కెనడా ప్రధాని వైఖరి తాజాగాబయటకు వచ్చిందని చెప్పాలి. భారత్ మీద తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు.. భారత దౌత్య సిబ్బందిపై తప్పుడు ఆరోపణలు చేసిన ట్రూడో.. తాజాగా విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని.. నిఘా వర్గాలు అందించిన సమాచారం మాత్రమే ఉందంటూ నాలుక మడతేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్న తన స్వీయ ఆరోపణల్ని సైతం ఆయన తనదైన శైలిలో మార్చి చెప్పారు. కేవలం నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే భారత్ మీద ఆరోపణలు చేసిన వైనాన్ని అంగీకరించారు.

అలా అని తన తప్పును పూర్తిగా ఒప్పుకోకుండా తెలివితేటల్ని ప్రదర్శిస్తూ.. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయంటూ కొత్త పాటను అందుకున్నారు. కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందుకు వచ్చిన ట్రూడో.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో సహకరించాలని భారతదేశాన్ని కెనడా కోరినట్లు చెప్పిన ట్రూడో.. ‘‘వారు ఆధారాలు కావాలని కోరారు. భారత భద్రతా సంస్థలు మరింత దర్యాప్తు చేయాలని చెప్పాం. మనకు సహకరించాలని కోరాం. ఎందుకంటే.. ఆ సమయంలో కెనడా వద్ద కేవలం నిఘా వర్గాల సమాచారం మాత్రమే ఉంది’’ అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.

జీ20 ముగింపు సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడిన సందర్భంలో ఇదే విషయాన్ని ఆయనకు చెప్పానని ట్రూడో చెప్పారు. అయితే.. కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారని.. వారిని అరెస్టు చేయాలని మోడీ తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాను కెనడాకు తిరిగి వచ్చిన తర్వాత కానీ.. కెనడాను విమర్శించే ధోరణిని భారత్ అవలంభిస్తోందన్న విషయం తమకు అర్థమైందన్నారు. ‘‘కెనడాను విమరశించటం.. మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించటమే వారి అసలు ఉద్దేశం’’ అని ట్రూడో వ్యాఖ్యానించారు.

నిఘా సమాచారం తప్పించి తమ వద్ద ఆధారాల్లేవని ఓవైపు చెబుతూనే మరోవైపు.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ సందర్భంగా మళ్లీ పాత పాటను అందుకున్నారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారాన్ని సేకరించి లారెన్స్ బోష్ణోయ గ్యాంగ్ కు చేరవేస్తున్నట్లుగా ఆరోపించారు. నిజానికి ఇవే ఆరోపణల్ని ట్రూడో ప్రభుత్వం సోమవారం చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతారన్ని చెప్పటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. భారత్ మీద ట్రూడో చేసిన ఆరోపణ సారంలో పస లేదన్న విషయం తాజా పరిణామం చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.