Begin typing your search above and press return to search.

ట్రూడో సంచలన నిర్ణయం... కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం!

By:  Tupaki Desk   |   6 Jan 2025 5:39 PM GMT
ట్రూడో సంచలన నిర్ణయం... కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం!
X

అనుకున్నట్లుగానే జరిగింది. కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... లిబరల్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధానమంత్రి పదవికీ జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొంత పార్టీ నేతల నుంచి గత కొంతకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో.. అటు పార్టీ చీఫ్ పదవికి, ఇటు ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న అనంతరం వీటికి తన రాజీనామా సమర్పిస్తానని వెల్లడించారు.

కాగా... 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని కథనాలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లిబరల్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం జరగనుందని.. ఆ సమావేశంలోనే లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ట్రూడోను పక్కకు తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో రాబోయే రాబోయే 48 గంటల్లో లిబరల్ పార్టీ నాయకత్వ పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామాను ప్రకటించే అవకాశం ఉందని.. ఆయన ప్రధాని పదవికి కూడా రాజీనామా చేస్తారని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఊహించదానికంటే ముందుగానే ట్రూడో తన నిర్ణయాన్ని ప్రకటించేశారు.

వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెలువడుతున్న పోల్స్ ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియారీ పోయిలీవ్రే కంటే ట్రూడో 20 పాయింట్లు వెనుకబడి ఉన్నాడని తేలిందని.. అతడు ఇంకా ఆ పదవిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు దారుణంగా వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.

దీంతో... పరిస్థితులు అన్నీ గ్రహించిన జస్టిన్ ట్రూడో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన చేశారు. మరోపక్క పార్టీ తాత్కాలిక నాయకుడిగా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన ఎంపిక కన్ ఫాం అయితే.. వెంటనే ట్రూడో తన రాజీనామాను సమర్పించేస్తారన్నమాట!