మా నిఘా అధికారులు నేరగాళ్లు.. ట్రూడో గొంతులో అసహనం
మరోవైపు కెనడా మీడియలో భారత ప్రధాని, విదేశాంగ మంత్రులు సైతం నిజ్జర్ హత్య కుట్రలో భాగమైనట్లు కథనాలు వచ్చాయి. దీంతో ట్రూడో గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
By: Tupaki Desk | 24 Nov 2024 11:53 AM GMTఒక సాధారణ ఉగ్రవాది.. అది కూడా వేరే దేశంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఉగ్రవాది అంశం ఏకంగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య తీవ్ర వివాదం రేపుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో..? అతడే ఖలిస్థానీ అనుకూలుడు హర్దీప్ సింగ్ నిజ్జర్. కెనడా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఖలిస్థానీలు ఈ రెండు దేశాల మధ్య తీవ్ర అగాథం రేపారు. బహుశా భవిష్యత్ లో మరెప్పటికీ పునరుద్ధరణ కాని విధంగా దెబ్బతిన్నాయి. ఇంతకూ ఈ కేసులో నిందితులెవరు? అనేది ఎప్పటికి తేలుతుందో?
నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఖలిస్థానీలకు బాగా మద్దతుగా మాట్లాడే కెనడా ప్రధాని ట్రూడో ఏకంగా దీనిని తన రాజకీయాలకు వాడుకున్నారు. ఆయన ఆదేశాలు లేకుండా.. నిజ్జర్ హత్య కుట్రలో భారత్ పాత్ర ఉందనే ఆరోపణలు బయటకు రావు. మరోవైపు కెనడా మీడియలో భారత ప్రధాని, విదేశాంగ మంత్రులు సైతం నిజ్జర్ హత్య కుట్రలో భాగమైనట్లు కథనాలు వచ్చాయి. దీంతో ట్రూడో గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
సమాచారం లీక్ అయింది
నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై తమ మీడియాలో వచ్చిన కథనాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతుక్కుమన్నారు. అసలే రాజకీయంగా తనకు ఎదురుగాలి వీస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో కెనడా ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్థులని నిందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారని వ్యాఖ్యానించారు. అలా అలా.. దాని నుంచి తప్పుడు కథనాలు పబ్లిష్ అయ్యాయని చెప్పుకొచ్చారు. దీంతో నిజ్జర్ హత్యలో విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలన్నారు. తద్వారా మీడియాకు అత్యంత రహస్యమైన, తప్పుడు సమాచారం లీక్ కాకుండా నిరోధించగలమని వ్యాఖ్యానించారు.
ఇంతకూ ఏం జరిగింది?
‘ది గ్లోబ్ అండ్ మెయిల్’.. కెనడాకు చెందిన న్యూస్ పేపర్. ఇందులో ఖలిస్థానీ నిజ్జర్ హత్యపై ఓ కథనం వచ్చింది. అతడి హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కుట్ర పన్నినట్లు పేర్కొంది. కెనడా సీనియర్ జాతీయ భద్రతాధికారి పేరిట దీనిని రాసుకొచ్చింది. ఇదే కథనంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరునూ ప్రస్తావించింది. ఈ విషయమై భారత్ తీవ్రంగా మండిపడింది. దీంతో ఆ కథనాలు అవాస్తవమని కెనడా ఖండించింది. మోదీ, విదేశాంగ మంత్రికి ఖలిస్థానీ నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ పేర్కొనలేదని.. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవి ఊహాజనితమని వెల్లడించింది.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ ట్రూడో నిరుడు వ్యాఖ్యానించారు. దీంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరునూ రెండు నెలల కిందట చేర్చారు. అలా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.