జగన్ ప్రభుత్వంలో ఒక్కో మంత్రిదీ ఒక్కో అవతారం...!
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ బీసీలను ముందు వరసలో నిలబెట్టే బీసీ సంక్షేమం, సమాచార వ్యవహారాల శాఖ మంత్రిగా తాను కీలకంగా ఉన్నానని అన్నారు.
By: Tupaki Desk | 19 Oct 2023 11:59 AM GMTముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో దశావతారాలు ఉన్నాయని ఆసక్తికరమైన కామెంట్స్ ని చేశారు బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో మంత్రి ఒక్కో అవతారంలో ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్యల మీద సమరం చేస్తున్నారు అని తనదైన విశ్లేషణ వినిపించారు.
ఆయన దృష్టి కోణంలో నుంచి చూస్తే బీసీ మంత్రులు పది మంది జగన్ మంత్రివర్గంలో ఉన్నారని, వారంతా సమస్యలు అనే వాటి మీద దుష్ట శిక్షణ చేస్తూనే అభివృద్ధి పధంలో ఏపీని నడిపిస్తున్నారు అని అన్నారు. గతంలో విష్ణుమూర్తి రాక్షసులను సం హరించడానికి పది అవతారాలు ఎత్తాడని, అలా ఏపీలో పేదరికం అంతం చేయడానికి వైసీపీ ప్రభుత్వంలో పది మంది బీసీ మంత్రులు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పుకున్నారు.
మొదటిగా చూసుకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మహిళలను చిన్నారులను ముందుకు నడిపించే శాఖ అన్నారు. అలా ఆమెది మొదటి అవతారం అన్నారు. అలాగే ఏపీలో బడుగులు పేదలతో సహా అందరికీ విద్యాబుద్దులు నేర్పించే కీలకమైన శాఖలో సీనియర్ బీసీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారని అన్నారు. ఆయనది రెండవ అవతారం అన్నారు. అలాగే ప్రజల ఆకలి బాధలను తీర్చే అతి ముఖ్యమైన శాఖలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారని అన్నారు. అలా మూడవ అవతారంగా ఆయన ఉన్నారని చెప్పారు.
ఇక పాడితో పాటు పశు పోషణ, సం రక్షణ వంటి బాధ్యతలను తీసుకున్న మంత్రి సీదరి అప్పలరాజుది నాలుగవ అవతారం అన్నారు. అదే విధంగా ప్రజలు అనారోగ్యం పాలన పడకుండా ఆదుకునే ముఖ్యమైన శాఖను చూస్తున్న వైద్య శాఖ మంత్రి విడదల రజనీది అయిదవ అవతారంగా పేర్కొన్నారు.
రెవిన్యూ భూ సంబంధింత వ్యవహారాలను చూస్తూ పేదలకు అండగా నిలిచే ఆరవ అవతారం రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుది అని అన్నారు. పేదలు అణగారిన వారు చెట్లు పుట్టలలో తలదాచుకుంటూ గూడు లేక బాధపడుతున్న నేపధ్యంలో వారికి సొంత ఇళ్ళను కట్టిస్తూ వారిని గొడుగుగా నిలిచే ఏడవ అవతారం గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది అని అన్నారు.
రెక్కలు ముక్ఖలు చేసుకుంటూ కార్మికులుగా బతుకులు ఈడ్చే వారి బాగోగులు చూసే కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయరాం ది ఎనిమిదవ అవతారం అన్నారు. ఇక పల్లెల అభివృద్ధి గ్రామాల అభ్యుదయం పంచాయతీల వెలుగు కోసం తాపత్రయపడే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడిది తొమ్మిదవ అవతారం అన్నారు.
తనది పదవ అవతారం అని స్వయంగా మంత్రి వేణుగోపాల క్రిష్ణ చెప్పుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ బీసీలను ముందు వరసలో నిలబెట్టే బీసీ సంక్షేమం, సమాచార వ్యవహారాల శాఖ మంత్రిగా తాను కీలకంగా ఉన్నానని అన్నారు.
తమ ప్రభుత్వంలో బీసీలకు పది కీలకమైన శాఖలను కేటాయించి జగం సముచితమైన స్థానం కల్పించారని మంత్రి కొనియాడారు. ఇలా ఒక్కో మంత్రి ఒక్కో అవతారం ఎత్తి బీసీలకు పీడిస్తున్న సమస్యల మీద సమరమే సాగిస్తున్నారని ఆయన వివరించడం మాత్రం ఆసక్తిగానే ఉంది.