చావు అదృష్టమేనట.. జ్యోతుల నెహ్రూ షాకింగ్ కామెంట్స్
తిరుపతిలో తొక్కిసిలాట ఘటన, అనంతర పరిణామాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
By: Tupaki Desk | 12 Jan 2025 1:38 PM GMTతిరుపతిలో తొక్కిసిలాట ఘటన, అనంతర పరిణామాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉదంతం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎంతలా చర్యలు తీసుకుంటున్నా, కూటమి నేతల మాటలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, బాధితులకు టీటీడీ తరఫున క్షమాపణలు చెప్పించడం ద్వారా నష్ట నివారణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... మరోవైపు నుంచి టీటీడీ సభ్యులు అనాలోచిత వ్యాఖ్యలు మరిన్ని సమస్యలు తీసుకువస్తున్నాయి. తాజాగా టీటీడీ సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే జ్యోగుల నెహ్రూ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
తొక్కిసలాట మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టీటీడీ రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా పరిహారం చెక్కులను యుద్ధప్రాతిపదకన పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సంచలన కామెంట్స్ చేశారు. దైవ సన్నిధిలో మరణించడమూ అదృష్టమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనిత, టీటీడీ సభ్యుల సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది.
విశాఖలో మృతుల కుటుంబ సభ్యులకు టీటీడీ తరుఫున పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ దైవ సన్నిధిలో మరణించడం కూడా అదృష్టమే. ముక్తి కోసం చాలా మంది మరణిస్తుంటారు. అయినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. బాధితులను ఆదుకుంటోంది అంటూ చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను కోల్పోయి బాధితులు తీవ్ర విషాధంలో ఉంటే, మరణాన్ని అదృష్టంగా సమర్థించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నేత నెహ్రూ వ్యాఖ్యలు ప్రతిపక్షానికి మరో అస్త్రంగా మారాయి.