Begin typing your search above and press return to search.

జగన్ కి ఎర్రన్న సంకేతాలు ?

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామక్రిష్ణ జగన్ కి ఒక విన్నపం చేశారు.

By:  Tupaki Desk   |   11 Nov 2024 4:09 AM GMT
జగన్ కి ఎర్రన్న సంకేతాలు ?
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే అయిదేళ్ళ పాటు మండిపోయి ఉద్యమాలు చేసిన వారిలో సీపీఐ ముందుంటుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామక్రిష్ణను అయితే చంద్రబాబు మనిషిగానే వైసీపీ నేతలు భావిస్తూ విమర్శిస్తూండేవారు. సీపీఐ సైతం టీడీపీతోనే అన్నట్లుగా ఉండేది.

కానీ ఎపుడైతే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిందో నాటి నుంచి సీపీఐ దూరం పాటించింది. ఇక సీపీఎం అయితే ఎపుడూ అంతలా టీడీపీతో రాసుకుని పూసుకుని తిరగలేదు. ఏపీలో చూస్తే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో కలసి పోటీ చేసి ఓటమిని మోస్తున్నాయి. ఈ మూడు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి.

ఏపీలో మాత్రం ఈ పార్టీలు ఏమీ కాకుండా అయిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారంలో చూస్తే ఎన్డీయే కూటమి ఉంది. అంటే టీడీపీ బీజేపీ జనసేన అన్న మాట. ఇక ఇండియా కూటమికి అయితే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా ఉంది. దీంతో జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిని ఎదిరిస్తున్న ఇండియా కూటమికి ఏపీలో అసెంబ్లీలో కనీసం వాణి వినిపించేందుకు ఒక సభ్యుడు కూడా లేకుండా పోయారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామక్రిష్ణ జగన్ కి ఒక విన్నపం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ప్రజల గొంతుని వినిపించాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వినిపించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ సీపీఐ, సీపీఎం లకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనందున వైసీపీయే ఏపీలో మొత్తం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అయన నొక్కి చెప్పారు. అదే సమయంలో అధికారంలో మిగిలిన మూడు పార్టీలు ఉన్నాయని అందువల్ల ప్రజల సమస్యలను లేవనెత్తే బాధ్యత వైసీపీ మీదనే పూర్తిగా ఉందని అన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత వైసీపీ మీదనే ఉందని ఆయన గురుతర భారానే మోపారు. అయితే సీపీఐ వైసీపీకి ఈ విధంగా సూచన చేయడం దేనికి సంకేతం అన్న చర్చ మొదలైంది.

సీపీఐకి వైసీపీకి మధ్య రాజకీయంగా చూస్తే అంతగా పొత్తు అయితే లేదు, వైసీపీ ఎపుడూ సోలో గానే ఎన్నికల్లో పోటీ చేసింది. విభజన ఏపీలో టీడీపీ కూడా కమ్యూనిస్టులతో కలసి పోటీకి దిగలేదు. 2014లో కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేశారు. వారే 2019కి వచ్చేసరికి జనసేనతో కలసి పోటీకి దిగారు. 2024లో కాంగ్రెస్ తో కలసి వెళ్లారు.

మరి 2027లో జమిలి ఎన్నికలు అయినా లేక 2029లో సార్వత్రిక ఎన్నికలు అయినా కొత్త పొత్తులు ఎత్తులతో వెళ్లాలని వామపక్షాలు భావిస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఇండియా కూటమి వైపుగా వస్తుందని ఒక ప్రచారం ఉన్న వేళ సీపీఐ నుంచి జగన్ కి ఈ రకమైన సూచనలు రావడం పైగా ప్రతిపక్షం మొత్తానికి వైసీపీయే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తోంది కాబట్టి ప్రజా గొంతుకంగా మారాలని సూచించడం బట్టి చూస్తే ఏదో జరుగుతోందా అన్నది అయితే ఉంది.

ఇక పోతే కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల అయితే తన అన్న అయిన వైసీపీ చీఫ్ ని రాజీనామా చేసి కూర్చోమని సలహా ఇచ్చారు. మరి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలలో ఈ విధంగా వైసీపీ పట్ల వైఖరిలో మార్పు ఉంది. ఏది ఏమైనా వైసీపీ విపక్షంలో ఉంది. అటు ఇండియా కూటమికి ఇంటు ఎన్డీయే కూటమికి ఈ రోజున చూస్తే సమ దూరం పాటిస్తోంది. రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటున్నారు.