Begin typing your search above and press return to search.

కేంద్రపాలిత ప్రాంతంగా తిరుపతి సాధ్యమేనా?

మరోవైపు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కోరారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 7:33 AM GMT
కేంద్రపాలిత ప్రాంతంగా తిరుపతి సాధ్యమేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, ఫిష్‌ ఆయిల్, పంది కొవ్వు కలిపారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశం అటు అధికార కూటమి నేతల మధ్య, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది. దీంతో సిట్‌ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీంతో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణను నిలిపివేసింది.

మరోవైపు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కోరారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతిని వాటికన్‌ సిటీలాగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని విన్నవించారు.

అలాగే లడ్డూ తయారీలో వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 740 మంది క్యాథలిక్కుల కోసం వాటికన్‌ ప్రత్యేక దేశంగా ఉందని కేఏ పాల్‌ గుర్తు చేశారు. అలాగే కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేంటన్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ పిటిషన్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపడం లేదు.

ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ పై ఎలా స్పందిస్తుదనేది ఆసక్తి రేపుతోంది.

సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి డైవర్ట్‌ చేసేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని లేపారని కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై జూలై నెలలోనే నివేదిక వస్తే సెప్టెంబర్‌ వరకూ ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. ఇప్పుడెందుకు బయటపెట్టారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని కూడా కలుస్తానని కేఏ పాల్‌ తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ తో పాటూ పలువురు నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దొంగలే దొంగల్ని విచారిస్తే వాస్తవాలు బయటకు రావన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడొద్దని కేఏ పాల్‌ సూచించారు. సిట్‌ విచారణ వేయడం ఏంటని.. సీబీఐ విచారణ జరగాలని కోరారు. లడ్డూ కల్తీ జరగలేదని.. రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.