Begin typing your search above and press return to search.

మధ్యలో మా అల్లు అర్జున్ ను లాగుతావేంటి ‘పాల్’

ఒకప్పుడు బాగా పరపతి గల పాల్ ఇప్పుడు తెలుగు రాజకీయాలపై సంచలన కామెంట్స్ తో దుమారం రేపుతున్నారు.

By:  Tupaki Desk   |   22 March 2025 1:37 PM IST
Ka Paul Fires On Betting Promotors
X

కేఏ పాల్.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు...ఈయనకు కౌంటర్లు ఇచ్చేవారు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవ మత గురువు. కేఏ పాల్ లాంటి సున్నితమైన మత పెద్దతో ఎవరూ పెట్టుకోరు. ప్రజాశాంతి పార్టీని పెట్టిన ఈయన మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నేతలను, కేంద్రంలోని పెద్దలను చీల్చి చెండాడుతుంటారు. అందరినీ పార్టీలు మాసేసి నా పార్టీలో చేరాలని కోరుతుంటాడు. పవన్ ను సైతం తన పార్టీలో చేరితే ఏపీకి సీఎం చేస్తానంటారు. ఒకప్పుడు బాగా పరపతి గల పాల్ ఇప్పుడు తెలుగు రాజకీయాలపై సంచలన కామెంట్స్ తో దుమారం రేపుతున్నారు.

ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు, హీరోయిన్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వారికి అంత కక్కుర్తి ఎందుకని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేయడం చాలా మంచి పరిణామమని కేఏ పాల్ అన్నారు. కోటి, రెండు కోట్ల రూపాయలు తీసుకునే నటీనటులు ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వారి వల్ల యువత తప్పుదోవ పడుతోందని, డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులు లేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి కుటుంబాలకు వంద కోట్లు ఇచ్చినా వారి ప్రాణాలను తిరిగి తీసుకురాలేరని పాల్ అన్నారు. పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ, విచారణ అనంతరం వాటిని విత్ డ్రా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అల్లు అర్జున్‌ను జైల్లో పెట్టి, 100 కోట్లు తీసుకున్నారని, ఆ తర్వాత కేసును నీరుగార్చారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి చర్యలు సరికావని ఆయన అభిప్రాయపడ్డారు. బెట్టింగ్స్ యాప్స్ వివాదంలో అనవసరంగా అల్లు అర్జున్ ను ఎందుకు లాగుతారంటూ ఆయన అభిమానులు పాల్ పై మండిపడుతున్నారు.

సినీ హీరోలు, హీరోయిన్లు వందల కోట్లు సంపాదిస్తున్నారని, సొంతంగా ఛారిటీ చేయాలని లేదా ఊరుకోవాలని కేఏ పాల్ సూచించారు. డబ్బులు తీసుకుని ఇలాంటి పనికిరాని యాప్‌లను ప్రమోట్ చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. యువత జీవితాలతో ఆడుకోవద్దని ఆయన సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.

కేఏ పాల్ ఎప్పుడు ప్రచారం కోరుకుంటారు. పెద్ద నేతలు, హీరోలను టార్గెట్ చేసి విమర్శిస్తుంటాడు ఇప్పుడు అల్లు అర్జున్ ను లాగి వివాదం రాజేశారు. అయితే ఇదంతా ప్రచారం కోసమేనని పాల్ కు తెలుసు. దీనిపై ఎలాగూ అల్లు అర్జున్ కానీ.. మిగతా వారు కానీ స్పందించరు. కానీ పాల్ రాజేసే మాటల మంటలు మాత్రం చిచ్చుపెట్టేలా ఉంటున్నాయని పలువురు విశ్లేషఖులు మండిపడుతున్నారు.