నటి జెత్వానీ కేసులో వైసీపీ నేతకు భారీ షాక్: ఏం జరిగింది?
తొలుత ఈ కేసును విజయవాడ పోలీసులు విచారించారు. తర్వాత.. విచారణ ముందుకు సాగడం లేదని గుర్తించిన ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
By: Tupaki Desk | 28 Oct 2024 2:32 PM GMTముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీని, ఆమె కుటుంబాన్ని విజయవాడ పోలీసులు వేధించారన్న కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అసలు జెత్వానీపై కేసు పెట్టిన వైసీపీకి నాయకుడు.. కుక్కల విద్యాసాగర్ కారణంగానే జెత్వానీని వేధించారని ఏపీ సీఐడీ పోలీసులు గుర్తించారు. తొలుత ఈ కేసును విజయవాడ పోలీసులు విచారించారు. తర్వాత.. విచారణ ముందుకు సాగడం లేదని గుర్తించిన ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. కుక్కల విద్యాసాగర్‌ను ఈ కేసులో ఏ-1గా పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారంటూ.. హైకోర్టులో కుక్కల విద్యాసాగర్ పిటిషన్ వేశారు. తన రిమాండ్ రిపోర్ట్ క్వాష్ చేయాలంటూ పిటిషన్‌లో ఆయన అభ్యర్థించారు. అయితే.. ఇటు నటి జెత్వానీ తరఫున, అటు కుక్కల విద్యాసాగర్ తరఫున ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టేసింది.
దీంతో కుక్కల విద్యాసాగర్ రిమార్ రిపోర్టు కొనసాగనుంది. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, డీసీపీ, సీఐల విచారణ కూడా కొనసాగనుంది. ఇప్పటికే వీరు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసి పుచ్చింది. మొత్తంగా జెత్వానీ కేసులో వైసీపీ నేతతో పాటు.. ఐపీఎస్‌లను విచారించేందుకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దోహద పడనున్నాయి.
ఇదీ కేసు..
ముంబైకి చెందిన జెత్వానీ.. ఓ ప్రముఖ వ్యాపార వేత్తపై అక్కడే ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ వ్యాపార వేత్తకు.. వైసీపీకి సంబంధాలు ఉండడంతో ఆయన అప్పటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. ఈ క్రమంలో కుక్కల విద్యాసాగర్ ద్వారా.. తన భూమిని జెత్వానీ ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారం టూ.. ఇబ్రహీం పట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల క్రమంలో జెత్వానీ సహా ఆమె కుటుంబ సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్టు చేసి వేధించారన్నది కేసు.