Begin typing your search above and press return to search.

కోర్టులో కాదంబరీ ఏమని చెప్పారు?

తాజాగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. న్యాయాధికారి ముందు తన విషయంలో ఏం జరిగిందో చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 9:30 AM GMT
కోర్టులో కాదంబరీ ఏమని చెప్పారు?
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సినీ నటి కాదంబరీ జెత్వానీ అక్రమ అరెస్టు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. న్యాయాధికారి ముందు తన విషయంలో ఏం జరిగిందో చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా వెలుగు చూశాయి. మొత్తంగా ఆమె వాంగ్మూలంలోని కీలక అంశం ఏమంటే.. తన అక్రమ అరెస్టుకు సంబంధించిన కుట్రకు బీజం పడింది నాటి సీఎంవోలో అన్న సంచలన విషయాన్ని ఆమె వెల్లడించారు.

అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా.. డీసీపీ విశాల్ గున్నీలను ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సీఎంవోకు జనవరి 31 పిలిచారని.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్.. పోలీసు ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. ఈ కారణంతోనే తనపై ఇబ్రహీంపట్నం స్టేషన్ లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని విశాల్ గున్నీ టీం ముంబయికి వెళ్లినట్లుగా ఆమె చెప్పారు.

ఇండస్ట్రిలిస్ట్ మీద తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాలపై ముంబయి వచ్చి తనను తన తల్లిదండ్రుల్ని అరెస్టు చేయటం మొత్తం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. "పోలీసులు కస్టడీలో నన్ను ఉదయం 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు మగ పోలీసు అధికారులే విచారించారు. ఏసీపీ హనుమంతరావు.. ఇన్ స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు. ముంబయిలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు" అని పేర్కొన్నారు.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని క్రియేట్ చేసి కట్టుకథ అల్లారన్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ విద్యాసాగర్ 2015లో ప్రపోజల్ తీసుకొస్తే దానికి నో చెప్పానన్నారు. దీన్ని మనసులో పెట్టుకొని కుట్రకు పాల్పడ్డాడని చెప్పారు. తనను అరెస్టు చేసిన సమయంలో అప్పటి పోలీసు విచారణ అధికారులపైనా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

"విచారణ అధికారి సత్యనారాయణ.. ఎన్ స్పెక్టర్ శ్రీధర్.. శ్రీను.. ఏడీసీపీ రమణమూర్తి.. ఎస్ఐ షరీఫ్ .. దుర్గ తదితరులు నాపై దురుసుగా ప్రవర్తించారు. నా ఫోన్ ను జనవరి 31 నుంచే ట్రాకింగ్ లో పెట్టారు. నా కదలికల్ని తెలుసుకున్నారు. నా తాత్కాలిక డ్రైవర్ ను బంధువుగా చూపించి.. అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసుల తప్పుడు సాక్షులను పెట్టి నమోదు చేసిన కేసు కారణంగా నా పరువు.. ప్రతిష్టలకు భంగం వాటిల్లింది" అంటూ తన వాంగ్మూలాన్ని కోర్టులో చెప్పినట్లుగా తెలిసింది. తదుపరి విచారణ తర్వాతి వాయిదాలో జరగనుంది.