బెజవాడకు వచ్చిన కాదంబరీ జత్వానీ పోలీసులకు ఏం చెప్పారు?
పోలీసు బందోబస్తు మధ్య తల్లి ఆశా జత్వానీతో కలిసి వచ్చిన ఆమె.. తొలుత నోవోటెల్ హోటల్ కు వెళ్లారు.
By: Tupaki Desk | 31 Aug 2024 5:34 AM GMTతనపై తప్పుడు కేసులు నమోదు చేసి ముంబయి నుంచి విజయవాడకు తీసుకురావటమే కాదు తనను ఎంతలా వేధించారు? ఎవరెవరు ఏమేం చేశారు? లాంటి అంశాలతో పాటు.. అప్పట్లో అసలేం జరిగిందన్న వివరాల్ని పోలీసులకు వెల్లడించారు. తనపై తప్పుడు కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురి చేయటమే కాదు.. ఏకంగా 42 రోజుల పాటు రిమాండ్ లో భాగంగా జైల్లో ఉంచిన విషయాన్ని వెల్లడించారు. గురువారం ముంబయి నుంచి హైదరాబాద్కు వచ్చిన కాదంబరీ జత్వానీ.. శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు.
పోలీసు బందోబస్తు మధ్య తల్లి ఆశా జత్వానీతో కలిసి వచ్చిన ఆమె.. తొలుత నోవోటెల్ హోటల్ కు వెళ్లారు. ఆ తర్వాత సాయంత్రం వరకు తన న్యాయవాదులతో చర్చలు జరిపారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన ఆమె.. తనపై పెట్టిన తప్పుడు కేసుల వివరాలతో పాటు.. విచారణ వేళ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలు.. డాక్యుమెంట్లు.. వీడియో క్లిప్లులను అందజేశారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ సాగింది.
తనపై తప్పుడు కేసులు పెట్టిన ఉదంతంలో నాటి నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు.. విజయవాడ సీపీ కాంతిరాణా తాతా.. డీసీపీ విశాల్ గున్ని ఉన్నట్లుగా పేర్కొన్నారు. విజయవాడలో తనపై కేసు నమోదు చేసే ముందు.. తన టీంను సీతారామాంజనేయులు ముంబయి పంపి.. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తొలుత విద్యాసాగర్ చేత కంప్లైంట్ ఇప్పించి.. కేసు నమోదు చేశారని.. అనంతరం తనను అరెస్టు చేశారన్నారు.
తాను పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు సాధారణ వ్యక్తుల మాదిరి వచ్చి.. ముంబయిలో పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై ఒత్తిడి తెచ్చారన్న ఆమె.. తనను బలవంతం చేసి సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. తనపై ఎక్కడా కేసులు లేవన్న ఆమె.. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. తాను పలువురిని హనీ ట్రాప్ చేసినట్లుగా ప్రచారం చేయటం తగదన్న ఆమె.. పెద్ద వయస్కులైన తన తల్లిదండ్రుల్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారన్న ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. దుబాయ్ లో ఉండే తన సోదరుడ్ని ఏ4గా చేర్చారని.. తనను 42 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారన్న ఆమె.. బెయిల్ కోసం లాయర్లను సంప్రదించే అవకాశం లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఈ కారణంగా బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు ఎక్కువ టైం పట్టిందన్నారు. 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వాల్సిన కేసులో తన కుటుంబాన్ని అనవసరంగా అరెస్టు చేసినట్లుగా ఆమె వాపోయారు. మొత్తంగా కొద్ది రోజులుగా ఏపీని ఊపేస్తున్న ఈ ఉదంతం తాజాగా కాదంబరీ విజయవాడకు రావటం.. తన వాదనను వినిపించటంతో పాటు కంప్లైంట్ ఇవ్వటంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లైంది.