కడియం.. కేకే.. ఎవరెంత డ్యామేజ్ చేశారు?
అయితే.. కేశవరావు.. కడియం శ్రీహరిలలో ఎవరి కారణంగా ఎక్కువ డ్యామేజ్ జరిగింది? గులాబీ పార్టీకి రియల్ షాక్ ఎవరి కారణంగా ఎదురైందన్నది ఆసక్తికర చర్చగా మారింది.
By: Tupaki Desk | 31 March 2024 5:33 AM GMTఅనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. లోక్ సభ ఎన్నికల హడావుడి ఓవైపు.. మరోవైపు విపక్షం నుంచి అధికారపక్షం వైపు క్యూ కడుతున్న నేతల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత కడియం శ్రీహరి కం తాజా గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండటం తెలిసిందే. వారిద్దరితో పాటు బీఆర్ఎస్ లో కీలక భాధ్యతలు నిర్వహించిన కె. కేశవరావు అలియాస్ కేకే, ఆయన కుమార్తె కం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మేయర్ గా వ్యవహరిస్తున్న విజయలక్ష్మిలు గులాబీ కారును దిగేసి.. హస్తం గూటికి చేరుకోవటం తెలిసిందే.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజు నుంచే.. రేవంత్ సర్కారు ఎక్కువ కాలం ఉండదని.. త్వరలోనే పడిపోతుందన్న ఊహగానాలు పెరగటం తెలిసిందే. దీనికి కౌంటర్ గా.. తాము గేట్లు ఎత్తాలే కానీ గులాబీ కారు ఖాళీ అయిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కడియం శ్రీహరి.. కేకేలు పార్టీలు మారుస్తూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.
అయితే.. కేశవరావు.. కడియం శ్రీహరిలలో ఎవరి కారణంగా ఎక్కువ డ్యామేజ్ జరిగింది? గులాబీ పార్టీకి రియల్ షాక్ ఎవరి కారణంగా ఎదురైందన్నది ఆసక్తికర చర్చగా మారింది. ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. గులాబీ కారును దిగేసిన రెండు పొలిటికల్ ఫ్యామిలీస్ లో ఒకరి మీద పాజిటివ్.. మరొకరిమీద నెగిటివ్ వాదనలు వినిపించటం ఆసక్తికరంగా మారింది. కేకేతో పోలిస్తే.. కడియం శ్రీహరి పార్టీ మారటాన్ని పెద్దగా విమర్శలు రావట్లేదు. అదే సమయంలో కేకే నిర్ణయాన్ని మాత్రం పలువురు తప్పు పడుతున్నారు.
84 ఏళ్ల వయసులో కేకే పార్టీ మారటాన్నితప్పు పడుతున్నారు. ఎవరో కాదు.. ఆయన సొంత కొడుకే ఆయన నిర్ణయాన్ని తీప్పు పడుతూ.. తాను మాత్రం గులాబీ కారు దిగేది లేదని తేల్చి చెప్పటం తెలిసిందే. కేకే శక్తిసామర్థాల గురించి అందరికి తెలిసిందేనని.. అలాంటి ఆయన్ను నెత్తిన పెట్టుకోవటమే కాదు రాజ్యసభ పదవిని రెండుసార్లు ఇస్తే.. ఈ రోజున పార్టీ మారతారా? అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే.. కడియం శ్రీహరికి మాత్రం అలాంటి విమర్శలు పెద్దగా రావట్లేదు. ఆయన్ను పోగొట్టుకోవటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నష్టంగాఅభివర్ణిస్తున్నారు. అదే సమయంలో కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికి లేదన్న కడియం.. ''నేను బీఆర్ఎస్ లో ఉన్న పదేళ్లు ఎలాంటి తప్పులు చేయలేదు. అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. చాలామంది పార్టీని.. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు కూడబెట్టారు. మేం అలా చేయలేదు. అరూరి రమేశ్.. పసునూరి దయాకర్ పార్టీ మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువగా విమర్శలు వస్తే అంత ఎక్కువ బలం ఉందని అర్థం. అవకాశాలు అందరికీ వస్తాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించుకున్నామన్నదే ముఖ్యం. బీఆర్ఎస్ కు ఎలాంటి అన్యాయం చేయలేదు. వరంగల్ ఎంపీ స్థానం పరిధిలోని నాయకుల నుంచి ఎలాంటి సహకారం లేదు. అందుకే పోటీ నుంచి వెనక్కి వచ్చాం'' అంటూ వ్యాఖ్యానించారు.
తన వెంట ఉన్న నాయకులు.. కార్యకర్తలు పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా ఉన్నామని.. ఇప్పుడు అధికారం లేకప్రతిపక్షంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. తొలిసారి బరిలోకి దిగుతున్న కడియం కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని అనుకున్నట్లుగా చెప్పారు. 30 ఏల్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేదని.. తనను ప్రశ్నించే హక్కు తన నియోజకవర్గంలోని ప్రజలకు తప్పమరెవరికీ లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్ని ఇలా ఉంటే.. కడియం.. కేకేల్లో.. కడియం కారణంగా బీఆర్ఎస్ కు ఎక్కువ డ్యామేజ్ జరిగితే.. కేకే కారణంగా బీఆర్ఎస్ కు సింపతీ పెరిగిందన్న మాట వినిపిస్తోంది.