విజయవాడలో కేసీఆర్ ల్యాండ్ క్రూయిజర్లు... కడియం శ్రీహరి వెర్షన్ ఇది!
దీంతో ఈ వ్యాఖ్యలపై బీఆరెస్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా కడియం శ్రీహరి ఈ విషయంపై స్పందించారు. ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసిన మాట వాస్తవమే అని అన్నారు.
By: Tupaki Desk | 30 Dec 2023 6:45 AM GMTకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన ధరఖాస్తు ఫారంను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో 22 ల్యాండ్ క్రూయిజర్లు పెట్టారంటూ సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఈ విషయంపై కడియం శ్రీహరి స్పందించారు.
అవును... కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి... మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పగటి కలల కన్నారని చెప్పుకొచ్చారు. అందుకోసమే ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. దానికోసం ప్రజా ధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నట్లు తనకు తెలిసిందని.. వాటిని విజయవాడలో దాచిపెట్టారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఈ వ్యాఖ్యలపై బీఆరెస్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా కడియం శ్రీహరి ఈ విషయంపై స్పందించారు. ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసిన మాట వాస్తవమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... అవి కేసీఆర్ సొంతానికి కొన్నవి కాదని తెలిపారు. ఈ సందర్భంగా వాటిని విజయవాడకు పంపిన విషయంపైనా స్పందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూయిజర్లను కొనడం జరిగిందని తెలిపిన శ్రీహరి... ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో... బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసమే ఆ వాహనాలను విజయవాడకు పంపించడం జరిగిందని.. ఇలా బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసం బెజవాడకు పంపడం ఎప్పటినుంచో ఉన్నదే అని క్లారిటీ ఇచ్చారు!
ఇదే సమయంలో... తాజాగా తెలంగాణ మంత్రుల బృందం కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం.. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుబ్బయట్టడం పైనా బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఇందులో భాగంగా... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే జ్యుడీషియల్ ఎంక్వైరీలు, శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల సందర్శన అని అన్నారు.
కాలయాపనతో ఎన్నికల హామీలను ప్రజలు మరిచిపోతారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని కడియం అన్నారు.