ఖలిస్థానీలు 2 వేలే.. వారితో సంబంధం లేదు.. కెనడా 'సిక్కులు' తొలగినట్టే?
కెనడా సిక్కు సంఘాల లెక్క ప్రకారమే చూస్తే 2 శాతం సిక్కులు మాత్రమే ఖలిస్థానీ మద్దతుదారులు. అంటే 2 వేల మంది ఖలిస్థానీ వాదాన్ని వినిపిస్తున్నారన్నమాట.
By: Tupaki Desk | 2 Oct 2023 7:53 AM GMTభారత్ తర్వాత ప్రపంచంలో సిక్కులకు రెండో దేశం ఏదంటే కెనడా. ఐదారు దశాబ్దాల కిందట మొదలైన వలస.. క్రమంగా పుంజుకుంది. ఇప్పటికీ పంజాబ్ సిక్కులు చాలామంది కెనడాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. కెనడాలో 10 లక్షల మంది సిక్కులు ఉన్నారంటేనే ఆ దేశంలో వారి ప్రభావం ఎంతో తెలిసిపోతుంది. కాగా, 40-50 ఏళ్ల కిందట రగులుకున్న ఖలిస్థానీ వాదం ఇటీవల క్రమంగా పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం తదితరాలు చేపట్టారు. ఈ వ్యవధిలోనే ఓ ఖలిస్థానీ నాయకుడి హత్య తీవ్ర దుమారం రేపింది. అది భారత్-కెనడా మధ్య దౌత్య పెను వివాదానికి దారితీసింది.
కెనడా సిక్కులకు 99 సమస్యలు..
ఇంగ్లిష్ మీడియా పేర్కొన్నదాని ప్రకారం కెనడా సిక్కులకు 99 రకాల సమస్యలున్నాయి. కానీ, ఖలిస్థాన్ వాటిలో ప్రధానం కాదు. వారి విశ్లేషణ ప్రకారం చూస్తే కెనడా సిక్కులందరూ ఖలిస్థాన్ మద్దతుదారులు కాదు. కెనడాలోనే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి ఖలిస్థానీ వాదంతో పెద్దగా ఒరిగేదేమీ లేదని కూడా తెలుసు. అయితే, కొంతమంది అతివాదులు చేస్తున్న కార్యక్రమాలు సిక్కు సమాజం అంతటినీ అనుమానంగా చూసే పరిస్థితి కల్పించాయి.
మా ప్రధాని తీరు సరికాదు..
దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు గత పది రోజులుగా ఎంతటి రచ్చకు కారణమైందో అందరూ చూశారు. కెనడా ప్రధాని ట్రూడో అయితే.. ఏకంగా భారత నిఘా సంస్థలే.. నిజ్జర్ హత్యకు కారణమని నిందించారు. కానీ, ఇదంతా సరికాదని అంటున్నారు కెనడా సిక్కులు. దేశంలో 2 శాతం సిక్కులే ఖలిస్థానీ మద్దతుదారులని.. వారితో తమకు అసలు సంబంధమే లేదని కుండబద్దలు కొట్టారు. కాగా, ఖలిస్థానీ సమస్యను భారత్-కెనడా త్వరగా పరిష్కరించుకోవాలని కూడా వారు సూచించారు. నిజ్జర్ హత్యలో ట్రూడో భారత్ ను నిందించడం, చిన్న పిల్లల తరహా వ్యాఖ్యలని కూడా తప్పుబట్టారు.
కెనడాలో 2 వేల మంది ఖలిస్థానీలు..
కెనడాలో సిక్కు జనాభా 10 లక్షలు. వారు అక్కడి సమాజంలో కలిసిపోయి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారు. ట్రూడో ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇస్తున్నారు. దీంతోనే ట్రూడోపై ఒత్తిడి తెచ్చి నిజ్జర్ హత్యపై ఆరోపణలు చేయించారు. కాగా, కెనడా సిక్కు సంఘాల లెక్క ప్రకారమే చూస్తే 2 శాతం సిక్కులు మాత్రమే ఖలిస్థానీ మద్దతుదారులు. అంటే 2 వేల మంది ఖలిస్థానీ వాదాన్ని వినిపిస్తున్నారన్నమాట. వీరే ఆ దేశంలో నిరసనలు, ఆందోళనలు సాగిస్తున్నారన్నమాట. మరిప్పుడు సిక్కు సంఘాల ప్రకటనతో ఏం జరుగుతుందో చూడాలి.