''కై''.. 17 ఏళ్ల ట్రంప్.. గట్టి పిండమే.. తాతకు తగ్గ మనమరాలు
అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతగా చర్చనీయాంశం అయిన ఎన్నికలు మరోటి లేవేమో? అంటే అతిశయోక్తి కాదు.
By: Tupaki Desk | 18 July 2024 11:03 AM GMTప్రపంచం చూపంతా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. బైడెన్ వైదొలగుతారా? లేదా? అని ఓవైపు.. ట్రంప్ గెలుపు ఖాయమనే అంచనాలు మరోవైపు.. వీటి మధ్యలో ట్రంప్ పై దుండగుడి కాల్పులు.. ఇంకోవైపు బెడెన్ కు కొవిడ్ పాజిటివ్.. ఇలా రోజుకో వార్త మీడియాలో వస్తూనే ఉంది. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతగా చర్చనీయాంశం అయిన ఎన్నికలు మరోటి లేవేమో? అంటే అతిశయోక్తి కాదు.
అమ్మాయి అదరగొట్టింది..
నవంబరులో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో రిపబ్లికన్ పార్టీ కీలకమైన జాతీయ సదస్సు నిర్వహించింది. ఇందులో 17 ఏళ్ల అమ్మాయి తన ప్రసంగంతో కట్టిపడేసింది. ‘‘ నా పేరు కై. అమ్మానాన్నలు పట్టించుకోకుంటే (నవ్వుతూ) ఆయన మాకు చాక్లెట్లు (క్యాండీ), సోడా (కూల్ డ్రింక్స్) తెచ్చేవారు. మీ అందరికీ తెలియని వ్యక్తి గురించి చెబుతా’’ అంటూ మొదలుపెట్టి.. తాతయ్యతో తన అనుంబంధాన్ని చెప్పుకొంటూ పోయింది. అసలే తాతకు ముద్దుల మనమరాలు ఏమో..? ఆయన గురించి ప్రపంచానికి తెలియని విషయాలు పంచుకుంది.
తాత ముందుగానే..
బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణ
ఆయన మనమరాలు కై ట్రంప్. పూర్తి పేరు కై మాడిసన్. 17 ఏళ్ల కై.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిన సమయంలో 9 ఏళ్ల బాలిక. ఇప్పుడు మాత్రం యుక్త వయసు బాలికగా తన తాతయ్య గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. ఎలాంటి బెరుకు లేకుండా పోడియం వద్ద నిలబడి మాట్లాడింది. మీడియాలో తాతయ్య ట్రంప్ ను తప్పుగా చూపిస్తారని.. ఆయన గురించి తనకు పూర్తిగా తెలుసని వివరించింది. మీరు చూడని ట్రంప్ ఒకరు ఉన్నారంటూ తెలిపింది. ఆ ట్రంప్ గురించి తాను చెప్పాలనుకున్నది చెప్పేసింది. ‘‘ఆయన ఎంతో ప్రేమ, జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటారు. పాఠశాలలో మేం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఓసారి నాకు మార్కులు బాగా వచ్చాయి. దీంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ప్రింట్ తీసి స్నేహితులకు చాలా గర్వంగా చూపించారు. మేం ఇద్దరం గోల్ఫ్ ఆడేవారం. అప్పుడు నన్ను సరదాగా ఓడించాలని ప్రయత్నించేవారు. దీంతో ‘నేనూ ట్రంప్‌నే’ అని గుర్తుచేస్తుంటా’’ అని కై నవ్వుతూ తెలిపింది.
ఆయన ప్రమాణాలు ఎక్కువ.. అయినా అందుకుంటా
ట్రంప్ తనకు పెద్ద ప్రమాణాలు (హై బార్) నిర్దేశించారని, ఏదో ఒక నాటికి వాటిని అందుకుంటామని కై తెలిపింది. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం గురించి కూడా కై స్పందించింది. ఆ ఘటనతో షాక్ తిన్నానని.. తాతయ్యను చాలామంది ఇబ్బంది పెట్టినా, ఆయన ధైర్యంగా నిలిచారని పేర్కొంది. ట్రంప్ తాతయ్యే తనకు స్ఫూర్తి అని.. ఏదో ఒకరోజు ఆయన స్థాయిని అందుకుంటానని.. ఐ లవ్ యూ’’ అంటూ ప్రసంగాన్ని ముగించింది. 17 ఏళ్ల కై ప్రసంగం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.