మాజీ మంత్రి కాకాణికి కష్టమే? విడిచిపెట్టేదే లేదంటున్న ప్రభుత్వం
నెల్లూరు జిల్లాలోని వైసీపీ కీలక నేత కాకాణిపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది.
By: Tupaki Desk | 1 April 2025 9:21 AMవైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి ప్రభుత్వం షాకిచ్చింది. అక్రమ మైనింగు కేసులో విచారణకు రమ్మంటూ కాకాణికి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఈ సారి బెయిల్ కూడా రాకుండా ఉండేలా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మైనింగ్ కోసం కాకాణి బ్యాచ్ పేలుడు పదార్థాలు వాడటాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తే, వారిపట్ల కాకాణి బెదిరింపులకు దిగారంటూ అభియోగాలు నమోదు చేశారు. దీంతో కాకాణి చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు.
నెల్లూరు జిల్లాలోని వైసీపీ కీలక నేత కాకాణిపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. అక్రమ మైనింగు కేసులో మార్చి 31న విచారణకు రమ్మంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులిచ్చిన సమయంలో ఆయన కానీ, కుటుంబ సభ్యులు కానీ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. కాగా, స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మార్చి 31న కాకాణి హాజరుకాలేకపోయారు. ఇక ఈ రోజు (ఏప్రిల్ 1) రావాలంటూ మరో నోటీసు కూడా జారీ చేశారు. ఈ నోటీసుకు కాకాణి స్పందించలేదు. నిబంధనల ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకు కాకాణి పొదలకూరు పోలీసుస్టేషనులో హాజరుకావాల్సివుంది.
పోలీసులు రెండుసార్లు నోటీసులిచ్చినా కాకాణి స్పందించలేదు. మరోవైపు పోలీసులు నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం తమ నోటీసులకు స్పందించని కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకాణి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు చెబుతున్నారు. కాకాణికి నెల్లూరులో మూడు ఇళ్లు ఉన్నాయి. ఈ మూడిళ్లలో ఆయన అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లివుంటారని భావించి పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే ఆయన హైదరాబాద్ లోనూ అందుబాటులో లేకపోవడంతో పరారయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు కాకాణి గురువారం నెల్లూరు వస్తారంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లిందీ స్పష్టంగా చెప్పడంలేదు. ఇదే సమయంలో దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ కాకాణి విసిరిన సవాల్ ను చాలెంజ్ గా తీసుకున్న టీడీపీ నేతలు వరుస కేసులు నమోదు చేసేలా ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాకాణికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ లభించని సెక్షన్లు నమోదు చేసేలా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారంటున్నారు. మొత్తానికి తాజా కేసుతో కాకాణి మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.