Begin typing your search above and press return to search.

కాకాణి ఎక్కడున్నారో? జల్లెడ పడుతున్న పోలీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నసోమ, మంగళవారాల్లో విచారణకు రమ్మంటూ నోటీసులిచ్చినా ఆయన గైర్హాజరు కావడంతో మరో చాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2025 9:11 AM
కాకాణి ఎక్కడున్నారో? జల్లెడ పడుతున్న పోలీసులు
X

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నసోమ, మంగళవారాల్లో విచారణకు రమ్మంటూ నోటీసులిచ్చినా ఆయన గైర్హాజరు కావడంతో మరో చాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మూడో చాన్స్ ఇచ్చినా కాకాణి మాత్రం తీరు మార్చుకోలేదు. ఈ రోజూ విచారణకు డుమ్మాకొట్టడంతో పోలీసులు సీరియస్ అవుతున్నారు. అయితే ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న కాకాణి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో ఎట్టిపరిస్థతుల్లో అయినా కాకాణిని అరెస్టు చేయాల్సిందేనన్న పంతంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో ప్రభుత్వానికి చెందిన రుస్తుం మైన్స్ లో అక్రమంగా చొరబడి రూ.250 కోట్ల విలువ చేసే క్వార్జ్ ను తవ్వేశారని అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా క్వారీకి సమీపంలో ఉన్న గిరిజన గ్రామంపై రాళ్లు పడుతున్నాయని అడిగినందుకు ఆ గ్రామానికి చెందిన గిరిజనులను బెదిరించారనే ఆరోపణలతో ఎస్సీ, ఎస్టీ కేసు అదనంగా నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో మాజీ మంత్రి వారం రోజులుగా అండర్ గ్రౌండుకు వెళ్లిపోయారు. నెల్లూరుతోపాటు హైదరాబాద్ లోనూ కాకాణికి చెందిన ఇళ్లు, ఆయన బంధువుల నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. కానీ, ఇప్పటివరకు కాకాణి ఆచూకీ తెలియలేదు. మరోపైవు ఆయన గురువారం నెల్లూరు వస్తారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసినా, కాకాణి మాత్రం బయటకు రాలేదు.

పోలీసులు ఎన్ని నోటీసులిచ్చినా, మాజీ మంత్రి కాకాణి లెక్క లేనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. అయితే తనకు వ్యతిరేకంగా నమోదైన రెండు కేసులపై కాకాణి హైకోర్టును ఆశ్రయించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆయన పోలీసుల ఎదుట హాజరవుతారని అంటున్నారు. తమ నేత ఎక్కడికీ వెళ్లిపోలేదని, అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వైసీపీ చెబుతోంది. ఇక గత ఆదివారం కాకాణి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన అందుబాటులో లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా కనిపించకపోవడంతో కాకాణి ఇంటి ప్రహారీకి నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం కూడా రమ్మంటూ మరో అవకాశం ఇచ్చారు. ఇలా ఇప్పటికి మూడు చాన్సులు తీసుకున్న కాకాణి.. పోలీసులను లెక్కచేయకపోవడంతో ఫలితం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. కాకాణిని అరెస్టు చేయాల్సిందేనంటూ టీడీపీకి చెందిన నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.