"అధికారులూ జాగ్రత్త.. కూటమి ఉండేది రెండేళ్లే"
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా అధికారులను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 15 Oct 2024 4:34 PM GMT''అధికారులూ జాగ్రత్త.. కూటమి ఉండేది రెండేళ్లే.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి'' - ఇదీ.. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా అధికారులను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 25 సంవత్సరాల పాటు అప్రతిహతంగా విజయం దక్కించు కున్న కాకాని తాజాగా జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత..కొన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నా.. ఇప్పుడు మరోసారి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''త్వరలోనే జమిలి ఎన్ని కలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఉండేది రెండేళ్లే. ఏదో చంద్రబాబు చెప్పాడనో.. పవన్ కల్యాణ్ చెప్పాడనో మా వోళ్లపై విర్రవీగితే.. తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అధికారులూ జాగ్రత్త...!'' అని కాకాని గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. వాస్తవానికి.. నిదానస్తుడిగా.. మృదు స్వభావిగా మంచిపేరున్న కాకాని ఇలా ఎందుకు రెచ్చిపోయారన్నది ప్రశ్న.
మద్యం దుకాణాలు దక్కకేనా?
తాజాగా జరిగిన మద్యం దుకాణాల ఏర్పాటు లాటరీల్లో నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తన అనుచరులను రంగంలోకి దింపారు. సుమారు 120 దరఖాస్తులు వేసినట్టు తెలిసింది. అయితే... 3 చోట్ల మాత్రమే లాటరీ లక్కు చిక్కింది. మిగిలిన వాటిలో 90 శాతం మద్యం షాపులు టీడీపీ నేతలకే దక్కాయి. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ జరిగిందని, దీంతో తమ వారు నష్టపోయారని కాకాని ఆవేదన. ఈ నేపథ్యంలోనేఅధికారులపై ఆయన చిందులు తొక్కారు.
''విద్య, వైద్యం, మద్యం షాపులు.. ఇసుక, గ్రావెల్స్ మొత్తం సిండికేట్స్‌గా మారాయి. చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ కోసమే కొత్త మద్యం పాలసీ. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అధికారులూ జాగ్రత్త'' అని కాకాని హెచ్చరించడం గమనార్హం.