కాకాని - సజ్జల.. కర్ర విడిచి సాము చేస్తున్నారే .. !
ఇక, కాకాని విషయానికి వస్తే.. తన పీఏ ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆయన ను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 25 Dec 2024 2:33 PM GMTవైసీపీలో ఇద్దరు కీలక నాయకులు.. ఒకే రోజు బెదిరింపుల పర్వానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇద్దరూ కూడా.. వైసీపీ అధినేత జగన్‌కు కుడి ఎడమలుగా ఉండే నాయకులు కావడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యం దక్కింది. 'తాము.. అధికారంలోకి వస్తే..' అంటూ.. సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఇద్దరూ కూడా.. బెదిరింపుల పర్వానికి దిగారు. దీంతో వీరి దూకుడు.. కర్ర విడిచి సాముచేస్తున్న చందంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
సజ్జల విషయానికి వస్తే.. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగితాము అధికారంలోకి వచ్చేందుకు నాలుగేళ్లే సమయం ఉందని..(ధీమాగా).. అప్పుడు టీడీపీ కార్యకర్తలు, నాయకుల అంతు చూస్తామని అన్నారు. అంతేకాదు.. పులిపంజా దెబ్బ ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని హెచ్చరించారు. ఇవన్నీ.. తాము చంద్రబాబు నుంచే నేర్చుకుంటామన్నారు.
ఇక, కాకాని విషయానికి వస్తే.. తన పీఏ ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆయన ను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఒంటిపై ఉన్న చొక్కాను తీసేశారని.. కాకాని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాము అధికారంలోకి వచ్చాక.. సీఐ చొక్కా తీసేసి.. ఏం చేస్తామో చూడాలని హెచ్చరించారు. ఇక, ఖాకీ చొక్కా ఒంటిపై ఉండదని కూడా బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. అన్యాయంగా.. తమ పీఏను అరెస్టు చేశారని.. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
కట్ చేస్తే..
కాకాని, సజ్జల చేసిన చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు తప్పుబడుతున్నారు. వారు కర్ర విడిచి సాము చేస్తున్నారని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీని కాపాడుకునేందుకు బలోపేతం చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా కేడర్‌ను మరింత వివాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు సరికాదని.. కేడర్‌ను సర్దుబాటు ధోరణితో ముందుకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. ప్రయోజనం కన్నా.. నష్టమే వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి సీనియర్లు మారుతారో లేదో చూడాలి.