Begin typing your search above and press return to search.

కార్పొరేట్ కాదు కాకినాడ పెద్దాసుపత్రిలో అదుర్స్ మూవీ చూపిస్తూ సర్జరీ

క్లిష్టమైన సర్జరీ అన్నంతనే కార్పొరేట్ ఆసుపత్రులు గుర్తుకు వస్తాయి. అయితే.. తెలివికి.. టాలెంట్ కు ఢోకా లేని ఎంతోమంది అత్యుత్తమ వైద్యులు సర్కారీ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:25 AM GMT
కార్పొరేట్ కాదు కాకినాడ పెద్దాసుపత్రిలో అదుర్స్ మూవీ చూపిస్తూ సర్జరీ
X

క్లిష్టమైన సర్జరీ అన్నంతనే కార్పొరేట్ ఆసుపత్రులు గుర్తుకు వస్తాయి. అయితే.. తెలివికి.. టాలెంట్ కు ఢోకా లేని ఎంతోమంది అత్యుత్తమ వైద్యులు సర్కారీ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. వారి టాలెంట్ కు సరిపడా సర్జరీలు చేసే అవకాశం అన్ని సందర్భాల్లో రాదు. కానీ.. కొన్నిసార్లు వైద్యుల చొరవ.. ఇతర కారణాలతో వారిలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంటుంది. తాజాగా అలాంటి క్లిష్టమైన సర్జరీని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు కాకినాడ సర్వజన ఆసుపత్రి.. సింఫుల్ గా చెప్పాలంటే జీజీహెచ్.


ఒక మహిళా రోగి మెదడులోని కణితిని తొలగించేందుకు చేపట్టిన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ మూవీని ట్యాబ్ లో చూస్తుండమని చెప్పి.. కణితిని తొలగించారు. మెదడుకు సర్జరీ చేసే సమయంలో వారిని స్ప్రహలో (అవేక్ క్రేనియాటమీ) ఉంచి చేయాల్సి ఉంటుంది. అందుకే.. ట్యాబ్ లో వారికి నచ్చిన సినిమాను చూపిస్తూ శస్త్రచికిత్సను చేపడుతుంటారు.

ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్.. బ్రహ్మానందం మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు సదరు రోగికి చాలా ఇష్టం. దీంతో.. వాటిని చూపిస్తూ.. ఆమె మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి.. న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణులు కలిసి ఈ క్లిష్టమైన సర్జరీని పూర్తి చేశారు. తొండంగి మండలానికి చెందిన 55 ఏళ్ల అనంతలక్ష్మి కొంతకాలంగా కుడికాలు..కుడి చేయి లాగుతున్న పరిస్థితి. పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యంగా చెబుతూ.. ఆ ఆరోగ్య సమస్య పరిష్కారం కాదంటూ చెప్పారు.

ఈ నెల 11న తలనొప్పి.. మూర్ఛ.. శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతున్న పరిస్థితుల్లో ఆమెను జీజీహెచ్ లో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడులోని ఎడమవైపు 3.3x2.7 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ చేసి కణితిని తొలించారు. ఆమెకు నచ్చిన సినిమా చూపిస్తూ.. ఆమె ఆనందంగా ఉన్న వేళలో నొప్పి తెలీకుండా సర్జరీ పూర్తి చేశారు. జీజీహెచ్ లో ఈ తరహా సర్జరీ ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సర్జరీలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు. ఏమైనా సర్కారీ దవాఖానాలో ఈ తరహా సర్జరీలు చేసినప్పుడు అనిపించేదొక్కటే.. ప్రభుత్వం నిజంగా ఫోకస్ చేస్తే.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి కళ్లెం వేసే వీలుందని. కానీ.. అలాంటి పరిస్థితి ఎప్పటికి అన్నదే అసలు ప్రశ్న.