Begin typing your search above and press return to search.

మనీ రూటింగ్ ఎలా జరిగింది? కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు

కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ వాటాల బదిలీపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 1:05 PM GMT
మనీ రూటింగ్ ఎలా జరిగింది? కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు
X

కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ వాటాల బదిలీపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. వాటాల కొనుగోలుకు సంబంధించిన రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చియి? ఎలా వచ్చాయనే అంశంపై ఫోకస్ చేసిన ఈడీ అధికారులు మనీ రూటింగ్ వెలికితీసే పనిలో పడినట్లు సమాచారం.

కాకినాడ సీ పోర్టు, కాకినాడ్ సెజ్ ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కేఎస్పీఎల్ ఓనర్ కేవీ రావు నుంచి బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో లింకులున్న అందరినీ విచారణకు రమ్మంటూ నోటీసులిచ్చిన ఈడీ అధికారులు మరోవైపు వాటాల కొనుగోలుకు సంబంధించి నిధులు ఎలా సమకూర్చుకున్నారనే విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వాటాలను కొనుగోలు చేసిన ఆర్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సీపోర్టు, సెజ్ యజమానులకు చెల్లించిన రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సమకూర్చారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. కేఎస్పీఎల్లోని 41.12% వాటాల విలువ దాదాపు రూ.2,500 కాగా, దాన్ని తక్కువగా అంటే రూ.494 కోట్లకు విలువ కట్టిన విషయంలో ఎలాంటి పద్ధతులు అవలంబించారనే విషయంపై ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టిందంటున్నారు.

కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద 2020 జులై 10న రూ.100 కోట్లు, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9న మిగతా రూ.394 కోట్లు చెల్లించింది. ఆయా చెల్లింపులు జరగటానికి కొన్నాళ్ల ముందు, అరో ఇన్ ఫ్రా లావాదేవీలపైనా ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా నిర్థారించుకున్న అధికారులు అరబిందో ఇన్ ఫ్రా డైరెక్టర్లను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నిందితులైన చెన్నైకు చెందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థ ప్రతినిధులను విచారించి, వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో కాకినాడ్ సీపోర్టు సంస్థ రూ.965 కోట్లు ఎగవేసిందంటూ ఈ ఆడిటింగ్ సంస్థ నివేదిక తయారుచేసింది. పోర్టు వాటాలు అరబిందోకు బదిలీ అయిన వెంటనే ఈ నివేదికను మార్పు చేసి పన్ను ఉల్లంఘనలను కేవలం రూ.9.03 కోట్లకు తగ్గించింది. ఇలా ఎందుకు చేశారు? ఎవరు చేయమన్నారు? అని ఆడిటింగ్ సంస్థకు చెందిన ఆడిటర్లను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఆడిటర్ల నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడైన అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయనుంది. గతంలో వీరిద్దరికీ నోటీసులివ్వగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నకారణంగా విజయసాయి, ముందస్తు కార్యక్రమాల వల్ల శరత్ చంద్రారెడ్డి హాజరుకాలేదు. దీంతో వారికి మరో తేదీన రమ్మనమని పిలిచే అవకాశం ఉంది.