చదువు ‘కొన’లేక చంపేశాడా? పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య కేసులో ఎన్నో సందేహాలు
కాకినాడలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఉన్నత విద్యావంతుడైన తండ్రి చంద్రకిశోర్ పిల్లలను చంపేసే అంటి కర్కశ మనస్తత్వం ఉన్నవాడు కాదని బంధువులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 March 2025 1:18 PM ISTకాకినాడలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఉన్నత విద్యావంతుడైన తండ్రి చంద్రకిశోర్ పిల్లలను చంపేసే అంటి కర్కశ మనస్తత్వం ఉన్నవాడు కాదని బంధువులు చెబుతున్నారు. కానీ, చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోట్ లో తానే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు క్లియర్ గా రాశాడని చెబుతున్నారు. దీంతో పోలీసులు ఈ మరణాల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరణించిన వారి దేహాలకు శనివారం పోస్టుమార్టం పూర్తయింది. శవాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఎంకామ్, ఎంబీఏ చదువుకున్న మృతుడు వానపల్లి చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఆయనకు కాకినాడలో సొంత ప్లాట్ కూడా ఉంది. భార్య తనూజా, ఇద్దరు పిల్లలతో హాయిగా ఉన్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతోపాటు పిల్లలు ఇద్దరినీ హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. పోటీ ప్రపంచంలో తన పిల్లలు బాగా చదవలేకపోతున్నారనే కారణంతో వారిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాశారు. అయితే ఆయన మరణానికి అది ఒక్కటే కారణం కాకపోవచ్చని బంధువులు అనుమానిస్తున్నారు.
మృతుడు చంద్రశేఖర్ పెద్ద కుమారుడు జోషిల్ (6)ను కాకినాడలో ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలో ఎల్కేజీలో చేర్పించాడని చెబుతున్నారు. ఆ స్కూల్ లో ఫీజులు రూ.లక్షల్లో ఉండటంతో యూకేజీకి వచ్చాక మాన్పించేశాడని, రూ.50 వేలు ఉండే మరో స్కూల్లో పిల్లలను చేర్పించడాని చెబుతున్నారు. చిన్నకుమారుడు నిఖిల్ కూడా ఎల్కేజీలో చేరడంతో ఖర్చులు బాగా పెరిగాయని అంటున్నారు. అయితే పెద్ద స్కూల్ నుంచి పిల్లలను చిన్న స్కూలుకి మార్చడం, చిన్న క్లాసుల్లోనే వేల రూపాయలు ఫీజులు ఉంటే, భవిష్యత్తులో రూ.లక్షలు పెట్టి చదివించగలనా? అనే ఆత్మనూన్యత భావనతోనే చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజులు కట్టలేకపోవడం, సరిగా చదవకపోవడం, స్థాయి తగ్గించడం వంటి చిన్న కారణానికే ముక్కుపచ్చలారని పిల్లలను పొట్టనపెట్టుకునే కర్కశ మనస్తత్వం తండ్రికి లేదని బంధువులు చెబుతున్నారు. పిల్లలు ఇద్దరు కళ్లకు గంతలు కట్టి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బాత్ రూమ్ వరకు తీసుకువెళ్లి బకెట్ లో ముంచి చంపడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. నీళ్లలో ముంచుతున్నప్పుడు పిల్లలు అరవలేదా? ఆ అరుపులు అపార్ట్ మెంట్ లో ఎవరికీ వినిపించలేదా? అనేది మిస్టరీగా మారింది. ఏ విషయాన్ని అయినా భార్యతో పంచుకునే చంద్రకిశోర్ ఇలా ఎలా చేశాడో అర్థం కావడం లేదని బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.