Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్లు చమటోడ్చారు...చాన్స్ దక్కేనా ?

కానీ అలాంటి ఆనవాయితీని మార్చేసి మరీ టీడీపీ కొత్త ముఖాలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 4:43 AM GMT
టీడీపీ సీనియర్లు చమటోడ్చారు...చాన్స్ దక్కేనా ?
X

తెలుగుదేశం పార్టీ ఈసారి మంత్రివర్గం కూర్పులో సీనియర్ నేతలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావడమే తడవుగా ఫలనా వారికి మంత్రి పదవి ఖాయం అని అంతా అనుకునే నేపథ్యం ఎపుడూ ఉండేది. కానీ అలాంటి ఆనవాయితీని మార్చేసి మరీ టీడీపీ కొత్త ముఖాలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది.

ఆ విధంగా చూస్తే కనుక ఉత్తరాంధ్రాలో సీనియర్లు పదవులు దక్కన జస్ట్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అలా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దాయన ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు కూడా అధినాయకత్వం పిలుపు మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లికి వచ్చి మరీ పోటీ చేశారు. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించి ఘన విజయాన్నే మూటగట్టుకున్నారు.

దాంతో మంత్రి యోగం ఖాయం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆయన కాకుండా తొలిసారి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కింది. దాంతో కిమిడి వర్గం డీలా పడింది. టీటీడీ చైర్మన్ పోస్టు ఆశించినా ఆశాభంగమే ఎదురైంది. దాంతో కళా విహీనంగా మాజీ మంత్రి శిబిరం ఇన్నాళ్ళూ నెట్టుకుని వచ్చింది.

అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కళా వెంకట్రావు రంగంలోకి దిగారు. తన వ్యూహాలను ఉపయోగించారు. కూటమి తరఫున అభ్యర్థులు లేకపోయినా ఏపీటీఎఫ్ నుంచి పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మను గెలిపించేందుకు శర్వ శక్తులూ ఉపయోగించారు. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ దీని మీద పీడీఎఫ్ నేతలు విమర్శలు చేసినా తగ్గలేదు.

విజయనగరం జిల్లాలో తాను పెద్ద దిక్కుగా నిలిచి రఘువర్మ గెలుపు కోసం తపన పడ్డారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా భావించారు. మొత్తానికి ఆయన పడ్డ కష్టం ఫలించిందని జిల్లాలో అంతా రఘువర్మకు అనుకూలంగానే పోలింగ్ సరళి ఉండొచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దీంతో కళా వర్గం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది.

మరో వైపు చూస్తే కనుక విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు. ఆయన కూడా ఈ గెలుపుని వ్యక్తిగతంగా తీసుకుని పనిచేశారని చెబుతుజ్ఞ్నారు. 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో ఆ విధంగానే రఘువర్మ గెలుపుని తీసుకున్నారు అని అంటున్నారు. దాంతో విశాఖ జిల్లాలో కూడా ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు

ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఇంతలా చమటోడ్చారు. కూటమి బలపరచిన ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించుకుని వస్తున్నారు అని అంటున్నారు. మరి దానికి గానూ వారికి దక్కే చాన్స్ ఏంటి అన్నది చర్చగా ఉంది. గంటా అంగబలం అర్ధబలం కలిగిన నాయకుడు, విశాఖ జిల్లాకు మంత్రి అంటూ ఎవరూ లేరు. దాంతో ఆయన ఆశలు ఎపుడూ సజీవంగానే ఉన్నాయని చెబుతున్నారు.

అదే విధంగా విజయనగరంలో బొత్స సత్యనారాయణ రాజకీయాన్ని వైసీపీని తట్టుకోవాలంటే కళా వంటి సీనియర్ రంగంలో ఉండాల్సిందే అని అంటున్నారు. ఆయన కూడా పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తుచ తప్పకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్లకు హైకమాండ్ మంచి గుర్తింపు ఇచ్చే అవకాశాలు అందిస్తుందా అన్నది చర్చగా ఉంది. వారి అభిమానులు అనుచరులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.