నా కుమారుడికి సీటు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా: బాబుకు మాజీ మంత్రి షాక్!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు
By: Tupaki Desk | 1 Sep 2023 6:16 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో యాత్ర చేపట్టారు. మరోవైపు బాబు తనయుడు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది.
కాగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంగా మొదటి నుంచి పేరున్న ఉత్తరాంధ్రలో ఈసారి చంద్రబాబుకు సీనియర్ నేతలు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా మాజీ హోం మంత్రి, టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నుంచి చంద్రబాబుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని టాక్ నడుస్తోంది.
ఉత్తరాంధ్రలోనే అత్యంత సీనియర్ గా నేతగా ఉన్న కళా వెంకట్రావు 1983, 1985, 1989, 2004ల్లో విజయనగరం జిల్లా ఉణుకూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో ఉణుకూరు రద్దు కావడంతో ఎచ్చెర్ల నుంచి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ తరఫున ఎచ్చెర్ల నుంచి గెలుపొందారు. మధ్యలో 1998 నుంచి 2004 వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో హోం శాఖ, విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నులు, పురపాలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఏపీ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరించారు. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై ఎచ్చెర్లలో కళా వెంకట్రావు ఓడిపోయారు.
అయితే ఈసారి కళా వెంకట్రావును లోక్ సభ ఎన్నికలలో విజయనగరం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కళా వెంకట్రావు ఒక షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును తన కుమారుడికి ఇవ్వాలని.. లేకుంటే తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం. తన కుమారుడు మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల లేదా చీపురుపల్లి అసెంబ్లీ సీటును కేటాయించాలని కళా కోరుతున్నారని అంటున్నారు.
మరి కళా వెంకట్రావు కోరికకు చంద్రబాబు సమ్మతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని దాదాపు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు కుటుంబం నుంచి ఆయనకు, ఆయన తనయుడికి, ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జునలకు చంద్రబాబు సీట్లు ఇస్తారా అనేది వేయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.