కాళేశ్వరంపై కేసీఆర్ నోరిప్పితేనే.. విమర్శల నోళ్లు మూతపడేది
ఇక కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రతిపక్షాల మరో ఆరోపణ. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందనేది విమర్శ
By: Tupaki Desk | 6 Nov 2023 4:02 PM GMTసరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన.. మరెంతో ఘనంగా చెప్పుకొనే '' కాళేశ్వరం ప్రాజెక్టు'' అత్యంత చర్చనీయాంశం అయింది. వాస్తవానికి అంతా బాగుంటే.. ఈపాటికి కాళేశ్వరం ఘనతను గొప్పగా చెప్పుకొనే అవకాశం బీఆర్ఎస్ కు ఉండేది. కానీ, అనుకోకుండా మేడిగడ్డ బ్యారేజీ కుంగడం దుమారం రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదిక బీఆర్ఎస్ ను ఇరుకున పడేసింది. అదే సమయంలో అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడడం.. వివాదాన్ని రాజేసింది. అధికార పార్టీకి దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఎన్నో విమర్శలున్నాయి. వీటిలో వాస్తవం ఎంతో పక్కనబెడితే.. ప్రతిపక్షాలకు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలకు వేదికగా మారింది ఆ ప్రాజెక్టు. మరోవైపు కాళేశ్వరం తెలంగాణకు వరదాయిని అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు ప్రాణహిత –చేవెళ్ల ను మార్చి నిర్మించారు. డిజైన్ సహా అన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ పూర్తి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నది కాళేశ్వరం. అందుకే గత ఏడాది పంప్ హౌస్ ల మునక నుంచి అన్నారం బ్యారేజీలో బుంగల వరకు అన్నిటికీ సీఎం కేసీఆర్ నే నిందిస్తుంటాయి ప్రతిపక్షాలు.
కేసీఆర్ కు ఏటీఎంగా మారిందన్న మోదీ
ఇక కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రతిపక్షాల మరో ఆరోపణ. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందనేది విమర్శ. కాగా, ప్రధాని మోదీ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి డబ్బులు రాల్చే ఏటీఎంలా మారిందని ఆరోపించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా సాగే ఈ విమర్శలను పక్కనపెడితే.. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కాళేశ్వరంలో లోపాలు బయటపడడం బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. వాస్తవానికి కాళేశ్వరం నిర్వహణ కొన్నేళ్ల పాటు కాంట్రాక్టు సంస్థలదే. ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిందేమీ ఉండదు. అది అసలు విషయం కాదు కదా..? కేసీఆర్ పూర్తిగా సంకల్పించి.. రీ డిజైన్ చేసి నిర్మాణం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో లోపాలు బహిర్గతం కావడం అసలు విషయం.
ప్రతిపక్షాలకు జవాబిస్తారా?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మొన్నటిదాక అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ వరకు ఇటీవల కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు. రేపోమాపో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆయన ఇప్పటికే ఏటీఎం అని ఆరోపించారు. తెలంగాణ ప్రదాతగా చెప్పుకొనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో అగ్ర నేత ప్రియాంక గాంధీ సైతం తమ ప్రసంగాల్లో కాళేశ్వరంను ప్రస్తావించడం సహజం. ఇప్పటివరకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. కాళేశ్వరం తెలంగాణకు వరమని, కాంగ్రెస్ శనీశ్వరమని పంచ్ డైలాగులు కొట్టారు. అయితే, అసలు చెప్పాల్సింది.. ప్రతిపక్షాల నోళ్లు మూయించే సమాధానం.
కేసీఆర్ నోరు తెరిస్తే..
ఎవరెన్ని చెప్పినా కాళేశ్వరం సీఎం కేసీఆర్ మానస పుత్రిక. ఆయన ఎంతో స్వప్నించి డిజైన్ చేసిన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టులో తీవ్ర లోపాలు బయటపడ్డాయని ప్రతిపక్షాలు ,కేంద్ర సంస్థలు తప్పుబడుతున్నాయి. మరి దీనిపై సమాధానం కేసీఆర్ నుంచి వస్తేనే వాటికి దీటుగా ఉంటుంది. అందులోనూ కేసీఆర్ కాళేశ్వరంపై అసెంబ్లీలోనే ప్రజంటేషన్ ఇచ్చారని.. మరి ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రజా సంఘాలు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. వీటికి శాశ్వతంగా చెక్ పెట్టేలా కేసీఆర్ రంగంలోకి దిగి మరోసారి వీడియో ప్రజంటేషనో లేక మీడియా సమావేశమో ఏర్పాటు చేసి.. విమర్శలను తిప్పికొట్టేలా జవాబివ్వాల్సిన అవసరం ఉంది. అందులోనూ రూ.లక్ష కోట్ల తెలంగాణ ప్రజల డబ్బును ఖర్చుచేసిన ప్రాజెక్టు కాబట్టి సీఎం హోదాలో కేసీఆర్ చెప్పేదానికి విలువ ఉంటుంది. కానీ, ఈ ఎన్నికల హడావుడిలో ఇందుకు అవకాశం ఉందా? అనేదే సందేహం. కేసీఆర్ కు ఆ ఉద్దేశం ఉందా? అనేదే ప్రశ్న.