Begin typing your search above and press return to search.

కాళేశ్వరం ఎస్ఐ ఆరాచకం.. లేడీ కానిస్టేబుల్ పై అత్యాచారం

ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న భవానీ సేన్ చేసిన దారుణ ఉదంతం వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:29 AM GMT
కాళేశ్వరం ఎస్ఐ ఆరాచకం.. లేడీ కానిస్టేబుల్ పై అత్యాచారం
X

సినిమాల్లో చూపించే విలన్ పోలీసుకు మించిన త్రాష్టుడు ఈ ఎస్ఐ. సర్వీసు రివాల్వర్ తో బెదిరించి తన దగ్గర పని చేసే లేడీ కానిస్టేబుల్ ను రేప్ చేసిన ఇతగాడి దుర్మార్గం తాజాగా బద్ధలు కావటమే కాదు పలు సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఇదంతా చూసి ఇంత ఆరాచకం జరిగింది మరో రాష్ట్రంలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇంత అరాచకం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న భవానీ సేన్ చేసిన దారుణ ఉదంతం వెలుగు చూసింది.

కాళేశ్వరంలోని లక్ష్మీ పంప్ హౌస్ సమీపంలోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందికి నివాసాలు కేటాయించారు. ఈ నెల 15న పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే మహిళా కానిస్టేబుల్ తన రూంకు రాత్రి పది గంటల వేళలో వెళ్లారు. అదే బిల్డింగ్ లో రెండో అంతస్తులో ఉండే భవానీ సేన్ అర్థరాత్రి ఒంటి గంట తర్వాత కిటికీని తొలగించి ఆమె గదిలోకి ప్రవేశించాడు.

సర్వీసు రివాల్వర్ ను చూపించి బెదిరింపులకు దిగిన అతడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రమైన భయాందోళనలకు గురైన ఆమె తన భర్తతో విషయాన్ని డిస్కస్ చేసి.. తాజాగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. దీంతో భవానీ సేన్ పై వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఉద్యోగం నుంచి శాశ్వితంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా వెలుగు చూసిన మరో అరాచక ఘటన ఏమంటే.. ఇరవై రోజుల క్రితం తాను కింద పడినట్లుగా దొంగ ఫోన్ చేసి సదరు లేడీ కానిస్టేబుల్ ను ఇంటికి పిలిచిన ఎస్ఐ.. ఆ టైంలో అత్యాచారయత్నం చేయగా.. ఆమె తప్పించుకుంది. ఈ దురాగతం గురించి వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో అతడ్ని మంగళవారం అర్థరాత్రి వేళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు డీఎస్పీలు.. ఐదుగురు సీఐలు.. భారీ బందోబస్తు మధ్య విచారణ చేసినట్లుగా చెబుతున్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చగా అతడ్ని రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసింది.

షాకింగ్ నిజం ఏమంటే.. ఇదే ఎస్ై మీద 2022 లో కూడా ఒక మహిళపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఆరోపణ ఉంది. అంతేకాదు.. మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపైనా లైంగిక దాడులకు పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఇంతకాలం ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ కీచక ఎస్ఐ ఎప్పుడు తనకు అండగా మంత్రి శ్రీధర్ బాబు ఉంటారంటూ తప్పుడు మాటలు చెప్పి.. అందరిని భయపెట్టేవాడన్న విషయం వెలుగు చూసింది.

ఈ నేపథ్యంలో స్పందించిన శ్రీధర్ బాబు.. తప్పుడు పనులు చేసినోళ్లు ఎవరైనా ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పేరుతో అతగాడు చేసిన ఆరాచకాల గురించి తెలిసిన ఆయన షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. క్లీన్ చిట్ ఇమేజ్ ఉన్న శ్రీధర్ బాబుకు తాజా ఎపిసోడ్ భారీ షాకింగ్ గా మారిందంటున్నారు. తన పేరును వాడుతూ తప్పుడు పనులకు పాల్పడిన ఎస్ఐ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.