కాళేశ్వరం ప్రాజెక్ట్... పెద్ద బలినే కోరుతోందా...?
అసమర్ధ నిర్వాకంతో ప్రాజెక్టుని కట్టారని, దీని వల్ల ప్రజా ధనం ఎంతో దుర్వినియోగం అయింది అని బీజేపీ సహా ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి.
By: Tupaki Desk | 4 Nov 2023 9:25 AM GMTసాధారణంగా పెద్ద ప్రాజెక్టులు ఎపుడూ ఇబ్బందులే తీసుకుని వస్తాయి. వాటి నిర్వహణ వ్యయం కొండంత ఉంటుంది. ఫలితాలు కూడా అనుకున్న స్థాయిలో లేకపోతే వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు, ఎనభై ఏళ్ళకు పైగా ఏపీలో పోలవరం ఒక కలగా ఉంది. అయినా పూర్తి కావడం లేదు. పోలవరం ప్రతీ ఎన్నికకూ ఒక ప్రభుత్వాన్ని బలిగా తీసుకుంటోంది. పోలవరం చంద్రబాబుకు ఏటీఎం గా మారిందని సాక్షాత్తు దేశ ప్రధాని ఆరోపించిన నేపధ్యం ఉంది.
మొత్తానికి చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చూస్తే తెలంగాణా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక పెద్ద సాహసంగా చూడాలి. దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తి గోదావరిని పారించే ఈ ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. దీని వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అన్నది పక్కన పెడితే టేకప్ చేయడమే రిస్క్ అని అంటూంటారు.
అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నామని కేసీయార్ సర్కార్ చెబుతోంది. నిజానికి ఇది బీయారెస్ సర్కార్ కి మేలు చేసేలా ఉండాలి. ఎన్నికల్లో బలమైన ఆయుధంగా ఉండాలి. కానీ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం ఒక సమస్య అయితే ప్రాజెక్ట్ కాస్ట్ కి ఫలితాలకు మధ్య తేడా వల్ల కూడా సక్సెస్ రేటు పూర్తిగా బీయారెస్ కి క్రెడిట్ కావడం లేదు
పోనీ పరిస్థితి అలా ఉంది అనుకున్నా ఇపుడు మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగింది. అలాగే, అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయి. సుందిళ్ల బ్యారేజీకి కూడా ముప్పు ఉందని కేంద్ర సేఫ్టీ అథారిటీ సంచలన విషయాలను ప్రకటించింది. దీంతో సరిగ్గా ఎన్నికల వేళ బీయారెస్ కి కాళేశ్వరం ప్లస్ కాకపోతే పోయింది పూర్తిగా మైనస్ అవుతున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.
ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, క్వాలిటీ, ప్లానింగ్, నిర్మాణం అంతటా పెద్ద ఎత్తున లోపాలు ఉన్నట్లుగా కేంద్ర సేఫ్టీ అధారిటీ అంటోంది. ఉన్న ఉదుటన ఏడో బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాలని సూచించింది. అన్ని పిల్లర్లు నిర్మాణ లోపంతో ఉంటే మాత్రం మొత్తం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని ఆదేశించింది.
దీంతో ఇపుడు అధికార బీయారెస్ కి పీకల్లోతు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్ట్ లక్షల కోట్లతో నిర్మించారు. అయినా సరే సర్వం లోపభూయిస్ఠం అంటున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది.
అపర భగీరధులం తామని కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించి ఓట్లు అడగాలని చూస్తున్న వేళ అదే ప్రాజెక్ట్ ఇపుడు కొత్త కష్టాలను తెచ్చి పెడుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే లక్షల ప్రజా ధనం ఇందులో వృధా అయింది అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే కేసీయార్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక ఏటీఎం గా మారింది అని ఘాటైన విమర్శలు చేసారు.
అసమర్ధ నిర్వాకంతో ప్రాజెక్టుని కట్టారని, దీని వల్ల ప్రజా ధనం ఎంతో దుర్వినియోగం అయింది అని బీజేపీ సహా ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుగా బీయారెస్ పరిస్థితి తయారైంది అని అంటున్నారు.
తమాషా కాకపోతే ఎన్నికల్లో బ్రహాస్త్రం అనుకున్న కాళేశ్వరం ఇపుడు రివర్స్ లో బీయారెస్ కే తగులుకుంటోంది. దాని వల్ల అధికార పార్టీ కార్నర్ అవుతోంది. ఈ పరిణామాలు చూస్తున్న వారు కృంగింది మేడిగడ్డ బ్యారేజీ కాదని, ఏకంగా బీయారెస్ అధికార ఆశలే అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి కోరుతోంది అని అంటున్నారు. అది ఇపుడు ఏకంగా బీయారెస్ ప్రభుత్వాన్నే బలి తీసుకుంటుందా అన్న కొత్త చర్చకు కూడా తెర లేస్తోంది. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. రైతులు రైతుల ప్రయోజనాలు అంటూ బీయారెస్ ని మాట్లడనీయకుండా చేస్తోంది. మరి దీన్ని ఎలా తట్టుకుని బీయారెస్ నిలబడుతుంది అన్నది చూడాల్సి ఉంది.