కలిశెట్టికి అశోక్ అశీస్సులు...!
బీసీ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయిన కలిశెట్టి తన విజయం తధ్యమని అంటున్నారు.
By: Tupaki Desk | 1 April 2024 3:56 AM GMTపూర్వాశ్రమంలో జర్నలిస్ట్ గా ఉండి అనంతర కాలంలో టీడీపీలో చేరి ఆ పార్టీ నిర్వహించే శిక్షణా తరగతులలో అధ్యాపకుడిగా మారి ఎందరినో అలా తీర్చి దిద్దిన కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు న్యాయం చేశారు. ఆయనకు నిజానికి 2019లోనే టికెట్ ఇవ్వాలి. కానీ సామాజిక సమీకరణలు కుదరక ఇవ్వలేకపోయారు.
ఈసారి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చారు. దాంతో కలిశెట్టి అప్పలనాయుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బీసీ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయిన కలిశెట్టి తన విజయం తధ్యమని అంటున్నారు. ఆయన విజయనగరం సంస్థానాధీశుడు అశోక్ గజపతిరాజుని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
విజయనగరం ఎంపీ సీటుని అనేక సార్లు పూసపాటి వంశీకులు గెలుచుకున్నారు. 2014లో అయితే అశోక్ గజపతిరాజు గెలిచి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారు. 2024లొ ఆయన పోటీకి అనాసక్తి చూపించారు అని అంటున్నారు. అయితే కలిశెట్టికి ఈ సీటు దక్కడం వెనక అశోక్ చక్రం తిప్పారని అంటున్నారు.
ఇపుడు కలిశెట్టిని గెలిపించాలని అశోక్ చూస్తున్నారు. ఈ సీటు మీద మక్కువ పడిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇచ్చారు. దాంతో ఆయన అక్కడికి పరిమితం అవుతున్నారు. కలిశెట్టి మాత్రం ఎంపీగా గెలిస్తే పార్లమెంట్ కి వెళ్తారు అని ఆయన వర్గం అంటోంది.
విజయనగరం రాజుల మద్దతుతో పాటు బొబ్బిలి రాజుల మద్దతు కూడా ఉంటే కలిశెట్టి విజయం తధ్యమని అంటున్నారు. బొబ్బిలి రాజులు కూడా కలిశెట్టి పట్ల అనుకూలంగానే ఉన్నారు. దాంతో కలిశెట్టి తన ప్రచారాన్ని మొదలెట్టేశారు.
విజయనగరం వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతం. దాంతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ గెలుచుకుంటుందని లెక్కలు ఉన్నాయి. ఈ దశలో అశోక్ కనుక రంగంలోకి దిగితే కలిశెట్టి విజయానికి బాటలు పడతాయని అంటున్నారు.
అశోక్ ఒక వైపు తన కుమార్తె విజయం కోసం శ్రమిస్తున్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా అంతటా ఆయన ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ వీక్ గా ఉన్న చోట బలోపేతం చేస్తున్నారు.
తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న చోట వారికే ఎంపీ సీటుని ఇవ్వడం ద్వారా టీడీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది అని అంటున్నారు. దాంతో ఇపుడు అశోక్ బాధ్యత కూడా ఎక్కువ అయింది అని అంటున్నారు. మరి 2014 రిపీట్ అవుతుందా కలిశెట్టిని ఎంపీని చేసి తన నిండు ఆశీస్సులు అశోక్ అందచేస్తారా అన్నది చూడాల్సి ఉంది.