Begin typing your search above and press return to search.

కదం తొక్కుతున్న కలిశెట్టి...కళాకు కష్టమేనా..?

ఈ రణస్థలం నుంచే రాజకీయ రణభేరీ మోగించడానికి కలిశెట్టి సిద్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే కలిశెట్టి పుట్టిన రోజుకు హై కమాండ్ గిఫ్ట్ ఏంటి అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:19 AM GMT
కదం తొక్కుతున్న కలిశెట్టి...కళాకు కష్టమేనా..?
X

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా ఎచ్చెర్ల ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పారిశ్రామికంగా విద్యా వైద్య రంగం పరంగా ఎచ్చెర్ల ముందుకు పోతోంది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త శ్రీకాకుళంగా దీన్ని చెబుతున్నారు. భవిష్యత్తు అభివృద్ధి అంతా ఎచ్చెర్ల కేంద్రంగా సాగనుందని అంటున్నారు. అంత సామర్థ్యం అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయని చెబుతున్నారు.

మరి అంతటి కీలకమైన ఎచ్చెర్లలో ఎమ్మెల్యే అంటే ఆషామాషీ కాదు. దాంతో ఈసారి టఫ్ ఫైట్ పార్టీల మధ్యన పార్టీల లోపలా కూడా సాగుతున్నాయి. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ని మార్చడానికి ప్రయత్నాలు సొంత పార్టీలో ప్రత్యర్ధులు చేస్తున్నారు. చాలా మంది పెద్దల కన్ను వైసీపీలో ఎచ్చెర్ల సీటు మీద ఉంది.

ఇక టీడీపీలో చూస్తే ఒక రకమైన పోరు సాగుతోంది. మాజీ మంత్రి అనేక రాజకీయ యుద్ధాలను చూసిన కురు వృద్ధుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు తన రాజకీయ జీవిత చరమాంకంలో సీటు కోసం సొంత పార్టీలోనే ఫైట్ చేయడం ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంది.

అయితే కళా వెంకటరావు ప్రాభవం తగ్గిందని అందుకే కొత్త వారిని తీసుకుని రావాల్సి ఉందని అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా చేసిన కళా వెంకటరావు అనేక సార్లు మంత్రిగా పనిచేసి ఉన్నారు. రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు. ఆయన ఈ దశలో కూడా కొత్తవారికి చోటివ్వరా అని ప్రత్యర్ధులు అంటున్నారు. ఇక ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు కదం తొక్కుతున్నారు.

ఆయన ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సర్వం సమకూర్చుకుంటున్నారు. ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, అలాగే విజయనగరానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అండ ఉందని అంటున్నారు. ఇక చినబాబు లోకేష్ చంద్రబాబు కూడా కలిశెట్టికి ఈసారీ చాన్స్ ఇద్దామని ప్రతిపాదిస్తున్నారుట.

కళా అయితే తగ్గేదే లేదు అంటూ పోటీకి సై అంటున్నారు. కళాకు ఎచ్చెర్లలో కొన్ని మండలాలలో పట్టు ఉంది. దాంతో ఈ సీనియర్ నేతతో సయోధ్య చేసుకునే కలిశెట్టికి టికెట్ ఇవ్వాలని హై కమాండ్ చూస్తోంది. ఇక లోకల్ గా చూస్తే మాత్రం కళా వర్సెస్ కలిశెట్టిగానే టీడీపీ రాజకీయం సాగుతోంది.

కలిశెట్టి చంద్రబాబు జైలులో ఉన్న టైంలో రోజుకో రకమైన ఆందోళన చేస్తూ హై కమాండ్ ని ఆకట్టుకున్నారు. ఇపుడు ఆయన పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అభిమానులు అనుచరులతో వేలాదిమందిగా అంతా చేరి అదిరిపోయే స్థాయిలో పుట్టిన రోజు జరుపుకోవాలని కలిశెట్టి చూస్తున్నారు. ఈ నెల 7న కలిశెట్టి పుట్టిన రోజు వేడుకలు రణస్థలంలో జరగనున్నాయి.

ఈ రణస్థలం నుంచే రాజకీయ రణభేరీ మోగించడానికి కలిశెట్టి సిద్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే కలిశెట్టి పుట్టిన రోజుకు హై కమాండ్ గిఫ్ట్ ఏంటి అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆయనకే టికెట్ కేటాయిస్తారు అని అనుచరులు నమ్మకంగా ఉన్నారు. మరి కలిశెట్టి పుట్టిన రోజు వేదికగా బల ప్రదర్శనకే సిద్ధపడ్డారు అని అంటున్నారు. మొత్తానికి కలిశెట్టి దూకుడుతో కళా వర్గం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. తదుపరి కార్యక్రమం కళా వర్గం ఎలా చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.