Begin typing your search above and press return to search.

బతుకమ్మకు కవిత దూరమేనా..?

తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా చూసేంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:30 PM GMT
బతుకమ్మకు కవిత దూరమేనా..?
X

తెలంగాణలో ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందడి నడుస్తోంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలై.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందీ సంబరం.. ఇలా 9 రోజులూ ఆడపడుచుల సందడే సందడి.. పూల పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ మహిళలు ఎంతగానో ఆరాధిస్తారు. దసరా ముంగిట ముగిసే బతుకమ్మను సాగనంపేటప్పుడు తమ ఇంటి ఆడబిడ్డను సాగనంపుతున్నట్లే బాధపడతారు. కాగా, బతుకమ్మ సంబరాలు శతాబ్దాలుగా ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రభుత్వం కూడా బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో దీని వైభవం మరింత పెరిగింది.

బీఆర్ఎస్ హయాంలో..

తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా చూసేంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ శ్రేణులు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించాయి. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు. దీంతో మరింత ప్రాచుర్యం లభించింది.

అధికారం కోల్పోయాక తొలి బతుకమ్మ

బీఆర్ఎస్ గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీని వరుస కష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి. కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుకెళ్లారు. ఐదు నెలలకు పైగా తిహాడ్ జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బయటకు వచ్చారు. కాగా, జైల్లో ఉన్న సమయంలోనే కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలను చూపుతూ కూడా కవిత బెయిల్ అభ్యర్థించారు. చివరకు బెయిల్ దొరికాక ఆ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లాక ఆమె బయటకు రాలేదు. తండ్రి వద్దనే ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల కిందట కవిత అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లుగానూ వార్తలు వచ్చాయి. కాగా, భార్య శోభ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కేసీఆర్ కేక్ తినిపిస్తున్న ఫొటోలో కవిత కనిపించారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి బతుకమ్మ ఇది కావడం గమనార్హం.

బతుకమ్మలో పాల్గొంటారా?

ఎవరు ఏమన్నా.. తెలంగాణలో బతుకమ్మను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు కవిత. ‘తెలంగాణ జాగృతి’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక సంస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అలాంటి కవిత ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బతుకమ్మ మొదలై మూడు రోజులైంది. బహుశా కవిత అనారోగ్యం నుంచి కోలుకున్నాక.. హాజరయ్యే అవకాశం ఉందేమో?