కవిత బయటకు వచ్చేదెప్పుడు? కనుచూపు మేర ఛాన్సు లేదా?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు జైలుపాలైన వారిని చూస్తే.. చాలా తక్కువ మందికి తప్పించి బెయిల్ రాకపోవటం కనిపిస్తుంది
By: Tupaki Desk | 6 July 2024 5:30 AM GMT‘ఏమవుతుందంకుల్? ఈడీనా.. బోడీనా.. ఎవరైతే వారు నోటీసులు ఇస్తే మేం వారికి సమాధానం ఇస్తాం’ అంటూ ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు తరచూ చర్చకు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న మొదట్లో.. తనకు లిక్కర్ స్కాంకు అస్సలు సంబంధమే లేదని వాదించిన కవిత ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు. అరెస్టు అయ్యే అవకాశాలే లేవన్నట్లుగా ప్రచారం జరిగిన స్థానం నుంచి.. ఇప్పుడా కేసులో బెయిల్ వస్తే చాలు భగవంతుడా? అన్న వరకు విషయం వెళ్లటం చూసినప్పుడు.. ఈ కేసులో కవిత పీకల్లోతు కూరుకుపోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు జైలుపాలైన వారిని చూస్తే.. చాలా తక్కువ మందికి తప్పించి బెయిల్ రాకపోవటం కనిపిస్తుంది. ఎవరి వరకో ఎందుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనీశ్ సిసోడియా విషయాన్నే తీసుకుంటే.. ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపి ఇప్పటికి పదిహేడు నెలలకు పైనే కావొస్తోంది. అయినా.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఈ కేసులో అరెస్టు కావటం.. ఆయనకు బెయిల్ వచ్చేస్తుందని ప్రచారం జరుగుతున్నా.. వచ్చినట్లుగా అనిపించటం.. కానీ రాకపోవటం లాంటి పరిణామాల్ని చూస్తున్నాం.
తాజాగా సైతం బెయిల్ విషయంలో కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ ఉదంతంలో కవిత జైలుకు వెళ్లి అప్పుడే మూడున్నర నెలలు అవుతోంది. అసలు అరెస్టు అయ్యే అవకాశమే లేదన్న చర్చ నుంచి.. అరెస్టు కావటం.. బెయిల్ రావటం అంతకంతకూ కష్టంగా మారుతున్న వైనం గులాబీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదంటున్నారు. ఈ ఏడాది మార్చి 16న హైదరాబాద్ లోని ఇంట్లో కవితను ఈడీ అరెస్టు చేయటం.. ఢిల్లీకి తరలించటం.. ఆ వెంటనే అరెస్టును చూపించి తీహార్ జైలుకు తరలించటంలాంటి పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున వేగంగా సాగిపోయాయి.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటానికి ఒక రోజు ముందు కవిత అరెస్టు మొత్తం రాజకీయ ప్రేరేపితంగా అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కేసీఆర్ కు ఉన్న పలుకుబడి.. న్యాయవాద రంగంలో ఆయనకున్న పరిచయాలు.. ఆయన పిలిస్తే పరుగులు తీస్తూ వచ్చే బడా లాయర్ల ధాటికి కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చి ఉండాల్సింది. అలా జరగకపోవటం వెనుక కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్న. లిక్కర్ స్కాంలో కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేసే విషయంలో విచారణ సంస్థలు సక్సెస్ అయ్యాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే.. కవిత తరఫు లాయర్లకు ఇబ్బందిగా మారిందని.. ఈ కారణంతోనే బెయిల్ సైతం దొరకట్లేదంటున్నారు.
కవిత అరెస్టు అయిన మొదట్లో గరిష్ఠంగా నెల పాటు జైల్లో ఉండే వీలుందని.. లేదంటూ యాభై రోజులకు మించి ఆమె జైల్లో ఉండే అవకాశం లేదన్నట్లుగా ప్రచారం జరిగింది. చూస్తుండగానే వంద రోజులు దాటి పోయి.. నాలుగు నెలలు అయ్యే పరిస్థితుల్లోకి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాని పరిస్థితి. అదే సమయంలో ఈ కేసులో అరెస్టు అయిన వారికి బెయిల్ ఉపశమనం చాలా చాలా తక్కువగా రావటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఎప్పుడున్న విషయంలో మరింత ఆలస్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఎప్పుడు లభిస్తుందన్న దానిపై గులాబీ ముఖ్యనేతలు సైతం ఏమీ చెప్పలేకపోవటమే దీనికి నిదర్శనమని చెప్పక తప్పదు.