Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఏపీ సెటిలర్స్ ఫ్రంట్.. దీని తెరవెనుక ఉన్నదెవరో?

ఉమ్మడి ఏపీ విభజన సందర్భంలో మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది లేకున్నా.. హైదరాబాద్ పైనే పీటముడి పడింది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 2:30 PM GMT
తెలంగాణలో ఏపీ సెటిలర్స్ ఫ్రంట్.. దీని తెరవెనుక ఉన్నదెవరో?
X

తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో ప్రధాన చర్చంతా హైదరాబాద్ మీదనే నడిచేది. తమిళనాడు నుంచి విడిపోయిన సందర్భంలో మద్రాస్ ను.. ఆపై ఉమ్మడి ఏపీ కోసం కర్నూలు రాజధానిని వదులుకున్నామని.. మన రాజధాని అని భావించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టామని ఇక్కడ సెటిలయిన, వ్యాపారాలు చేస్తున్న వారి తరఫున సీమాంధ్ర నాయకులు వాదించేవారు. ఇందులో ప్రజల కంటే సీమాంధ్ర నాయకుల ఆందోళనే ఎక్కువగా కనిపించేంది. మరోవైపు తెలంగాణ ప్రకటన జరిగాక కూడా అనేక అనుమానాలు, ఆందోళనలు. ఇక తెలంగాణ ప్రజల వాదన వేరేలా ఉండేది. ఉమ్మడి ఏపీ ఆవిర్భావం కంటే ముందే హైదరాబాద్ డెవలప్ అయిందని.. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నగరం ప్రత్యేకంగా ఎవరి ప్రమేయమూ లేకున్నా మరింత డెవలప్ అవుతుందని వ్యాఖ్యానించేవారు.

హైదరాబాద్ పైనే పీటముడి

ఉమ్మడి ఏపీ విభజన సందర్భంలో మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది లేకున్నా.. హైదరాబాద్ పైనే పీటముడి పడింది. అప్పటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారి ప్రయోజనాలను స్టేక్ హోల్డర్స్ అంటూ తెరపైకి తెచ్చారు. అయితే, హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా 2014 నాటికి తెలంగాణ సాకారమైంది. ఈ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ లో సెటిలయిన సీమాంధ్రుల విషయమై తీవ్ర చర్చ జరిగింది. ఈ పదేళ్లలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీమాంధ్రుల పరిరక్షణ కంటూ కొన్ని సంఘాలు వెలిశాయి. తమ గొంతులు వినిపించాయి. చివరకు అంతా ప్రశాంశంగా ముగిసింది.

మరోసారి తెరపైకి

పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు తీరి.. దాదాపు పదేళ్లు బీ(టీ)ఆర్ఎస్ అధికారం ముగిసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతికి పగ్గాలు వచ్చాయి. బీఆర్ఎస్ తెలంగాణలో తొలిసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లింది. ఇక ఇటీవలి పరిణామాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గాంధీ ఆంధ్రా వ్యక్తి అని అక్కడికే పంపిస్తామంటూ కౌశిక్ మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ మరోసారి తమ సెంటింమెంట్ ఆయుధమైన తెలంగాణవాదాన్ని ఎంచుకుంటోందా? అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఓ కీలక ప్రకటన కనిపించింది.

తెరవెనుక ఉన్నది ఎవరో?

తెలంగాణ ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ అంటూ ఇటీవల ప్రధాన మీడియాలో ఓ ప్రకటన కనిపిస్తోంది. దీనికి అడుసుమిల్లి కల్యాణ్ ప్రెసిడెంట్ గా ప్రకటనలో ఉంది. తెలంగాణలో ఏపీ సెటిలర్ల గొంతుక అనేది వీరి ఉద్దేశం. తెలంగాణలో ఉన్న ఏపీ సెటిలర్స్ కుటుంబసభ్యులందరికీ ఫ్రంట్ ఆవిర్భావ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. వాస్తవానికి తెలంగాణ, ఏపీ వాదనలు సమసి అంతా ప్రశాంతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కౌశిక్ రెడ్డి రాయి వేశారు. దీంతోనే తెలంగాణలో ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ ఉనికిలోకి వచ్చిందా? అనే అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ భవిష్యత్ లో మళ్లీ తెలంగాణ వాదం వినిపిస్తే దానికి కౌంటర్ గా ఈ ఫ్రంట్ ను ముందుకుతెచ్చే ఉద్దేశం ఉందా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. మరి దీని తెరవెనుక ఉన్నదెవరో?