మరోసారి హాట్ టాపిక్ గా గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం!
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. కేవలం కర్ణాటకలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పాపులర్ అయ్యారు
By: Tupaki Desk | 27 Oct 2023 8:51 AM GMTమైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. కేవలం కర్ణాటకలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పాపులర్ అయ్యారు. కర్ణాటక బీజేపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత అక్రమ మైనింగ్ వ్యవహారంలో జైలు పాలయ్యారు. దీంతో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారు. బీజేపీ కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని గాలి జనార్దన్ రెడ్డి.. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలో తాను పోటీ చేసి గెలుపొందిన బళ్లారి సిటీ నుంచి తన భార్య గాలి అరుణను బరిలోకి దింపారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు.
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరే గెలుపొందారు. ఆయన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు.
అయితే మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో గాలి జనార్దన్ రెడ్డి వాటిపైన దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో అయినా తన ప్రభావాన్ని చూపి క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26 బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కీలకమైన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించామని.. ప్రస్తుతం పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించామని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలతోపాటు అన్ని కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడానికి తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తెలిపింది. 2024లో వేసవిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో 28 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని స్థానాలు సాధించాలని గాలి జనార్దన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఆయన వ్యూహాలు ఈసారైనా ఫలిస్తాయో, లేదో వేచిచూడాల్సిందే.