Begin typing your search above and press return to search.

కేంద్రం 'హిందీ' విస్తరణపై మళ్లీ కమల్ హాసన్ ఫైర్

హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

By:  Tupaki Desk   |   5 March 2025 11:00 PM IST
కేంద్రం హిందీ విస్తరణపై మళ్లీ కమల్ హాసన్ ఫైర్
X

నటుడు కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలను బలవంతంగా హిందీ రాష్ట్రాలుగా మార్చి, బీజేపీ గెలుపును సులభతరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

- డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్‌ (పునర్విభజన) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కమల్‌హాసన్‌ కూడా పాల్గొని, కేంద్రం విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ స్వాతంత్య్రాన్ని హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

- స్టాలిన్‌ ఆందోళన

అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ, 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు 12 పార్లమెంటరీ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని, ఇది రాష్ట్ర గొంతును నొక్కేసే చర్యగా భావిస్తున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు విభజన ప్రక్రియకు వ్యతిరేకం కాదని, కానీ 2026 జనాభా లెక్కల ఆధారంగా దీనిని చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు.

- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు హడావిడి

వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కార్యాచరణను వేగవంతం చేశాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా, నటుడు, టీవీకే అధినేత విజయ్‌ కూడా స్వతంత్రంగా పోటీ చేయాలని యోచిస్తున్నారు.