ఎన్నికల్లో ట్రంప్ - కమలా ఎవరు గెలిస్తే ఏమవుతుంది?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మరో రోజులో మొదలు కానుంది. మరి.. గెలుపు ఎవరికి దక్కనుంది?
By: Tupaki Desk | 4 Nov 2024 5:30 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మరో రోజులో మొదలు కానుంది. మరి.. గెలుపు ఎవరికి దక్కనుంది? ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా మారనుంది? అధ్యక్ష పీఠం దక్కేదెవరికి? లాంటి ప్రశ్నలకు బోలెడన్ని సమాధానాలు రెఢీగా ఉన్నాయి. ఎవరి అంచనాలు వారివే. వాటిని పక్కన పడితే.. యావత్ ప్రపంచం ఈ ఎన్నికలవైపు చూడటానికి కారణం ఏంటి? అన్న విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ పోటీ ఉండటం.. అభ్యర్థుల మధ్య అధిక్యత వ్యత్యాసం తక్కువగా ఉండటమే.
దీనికి తోడు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా పెట్టుకోవటం.. దీనికి భిన్నంగా గెలుపు తీరాలకు ఒక మహిళ దగ్గరకు రావటం.. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు అధ్యక్ష స్థానంలో ఒక మహిళ ఉండటం జరిగింది లేదు. దీనికి తోడు ఈ ఇద్దరి విధానాలు తూర్పు.. పడమర మాదిరి ఉండటం కూడా ఒక కారణం. తాను విజయం సాధిస్తే అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పూర్తిగా మార్చేస్తానని ట్రంప్ చెబుతుంటే.. అంతర్జాతీయ అజెండాను మరింత పెంచుతామని కమలా హారిస్ చెబుతోంది.
నాటో విషయంలో వీరి అజెండా వేర్వేరుగా ఉండటం కూడా మరో కారణం. కమలా గెలుపుతో నాటోలో అమెరికా పెద్దన్న పాత్రను కొనసాగించేలా ఆమె విధానాలు ఉంటే.. సభ్య దేశాల మధ్య భారాన్ని పెంచాలన్నది ట్రంప్ తీరుగా చెప్పాలి. నాటోలోని 31 సభ్యదేశాల మిలిటరీ బడ్జెట్ మొత్తంలో 2/3 వంతును అమెరికా తన దేశ రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. ట్రంప్ గెలిస్తే సభ్యదేశాలు తమ జీడీపీలో 2 శాతం నిధులను నాటోపై వెచ్చించేలా ఒత్తిడి తెస్తామని ట్రంప్ చెబుతుననారు. 2024 నాటికి నాటోలోని 23 దేశాలే ఈ లక్ష్యాన్ని సాధించాయి.
ట్రంప్ గెలిస్తే చైనా నుంచి వచ్చే దిగుమతులపై 60-200 శాతం వరకు టారిఫ్ విధించే వీలుందని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి అయితే 20 శాతం పన్ను విధానాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. ఈ చర్యలు వాణిజ్య యుద్ధాలు.. ప్రతీకార చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుదుపులకు గురవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జోబైడెన్ అమలు చేసిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ విధానాలకు ట్రంప్ గండి కొట్టటం ఖాయమంటున్నారు.
పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అమెరికా.. నాటో చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ హయాంలో సేనల ఉపసంహరణ జరిగింది. దీంతో.. అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెండేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ వార్ విషయంలోనూ ఇద్దరిది వేర్వేరు విధానాలే. బైడెన్ సర్కారు ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చినట్లే.. కమలా సర్కారు కూడా అదే విధానాన్ని కొనసాగించే వీలుంది.
అదే సమయంలో ట్రంప్ గెలిస్తే మాత్రం.. ఆయన సర్కారు రష్యాతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థుల తీరు ఒకేలా ఉంది. తైవాన్ విషయంలో చైనా దాడి చేయకుండా చూస్తున్నందుకు.. తమకు డబ్బులు ఇవ్వాలని ట్రంప్ చెప్పటం తెలిసిందే. ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంటే అమెరికాలో వలసలకు కొత్త ఇబ్బందులు ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఇలా.. ప్రతి విషయంలోనూ ట్రంప్.. కమలా తీరు భిన్నంగా ఉండటంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.