నరాలు తెగే ఉత్కంటగా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నిక
గతానికి భిన్నంగా తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నడుస్తోంది. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత ఉత్కంట తాజా ఎన్నికల్లో కనిపిస్తోంది
By: Tupaki Desk | 27 Oct 2024 7:33 AM GMTగతానికి భిన్నంగా తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నడుస్తోంది. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత ఉత్కంట తాజా ఎన్నికల్లో కనిపిస్తోంది. ఎప్పుడు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన మెజార్టీ ఎవరికి ఉంది? ఎన్నిక ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న విషయాన్ని తెలిపేలాసర్వే ఫలితాలు ఉండేవి. అందుకు భిన్నంగా ఈసారి ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. దీంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది అంచనాలకు అందని రీతిలో తయారైంది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆయన.. ఈసారి ఎలాగైనా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్నారు. డెమొక్రాట్ల అభ్యర్థిగా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ బరిలో ఉన్నారు. తొలిసారి అధ్యక్ష బరిలో దిగిన ఆమె.. ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు తుది గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఇరువురి మధ్య పోటీ అంతకంతకూ తీవ్రం కావటం.. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నరాలు తెగే ఉత్కంటలా ఎన్నికల సర్వే ఫలితాలు వెలువడుతున్నాయి. పోలింగ్ కు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా చేసిన సర్వేల్లో ఇరువురు సమానంగా ఉన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న అంచనాపై ఎవరూ ఒక మాటను చెప్పలేని పరిస్థితి నెలకొంది. సీఎన్ఎన్ నిర్వహించిన తుది పోల్ లో ట్రంప్.. హారిస్ లకు చెరో47 శాతం మద్దతు పలుకుతున్నట్లు పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన తుది సర్వేలో చెరో 48 శాతం ఓటర్ల మద్దతు ఇద్దరికి సమానంగా వచ్చినట్లు పేర్కొంది.
ఫైనాన్షియల్ టైమ్స్, వర్సిటీ ఆఫ్ మిషిగన్ కు చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్వేలో ట్రంప్ నకు 44శాతం మంది.. హారిస్ కు 43 శాతం మంది మద్దతు పలికినట్లుగా పేర్కొంది. ఫైవ్ థర్టీఎయిట్ అనే సంస్థ పోల్ సర్వే నిర్వహించగా.. పోల్ ట్రాకర్ లో హారిస్ 1.7 శాతం అధిక్యంలో ఉన్నట్లుగా వెల్లడించింది. ఎన్నికల ఫలితంలో కీలకమైన జార్జియా, మిషిగన్, ఆరిజోనా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవడాల్లోనూ ఇరువురి మధ్య పోటీ పోటాపోటీగా ఉంది.
తుది ప్రచారంలో మహిళల సంతాన హక్కుల మీద హారిస్ ఫోకస్ చేస్తే.. ట్రంప్ అక్రమవలసల్ని లక్ష్యంగా చేసుకొనివ్యాఖ్యలు చేస్తున్నారు. విదేశాలు వద్దనుకున్న చెత్తనంతా అమెరికాలో డంప్ చేస్తున్నట్లుగా అక్రమ వలసలపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.టెక్సాస్ తో సహా 14 రాష్ట్రాల్లో అబార్షన్ మీద నిషేధం ఉండగా దానిని ఎత్తేసేందుకు ప్రయత్నం చేస్తానని హారిస్ సభల్లో హామీ ఇస్తున్నారు. మొత్తంగా తుది ఫలితం మహా టెన్షన్ గా మారిందని చెప్పక తప్పదు.