Begin typing your search above and press return to search.

కమలా హారీస్ పౌరసత్వంపై బిగ్ ట్విస్ట్... ఏమిటీ 1857 కేసు..?

ఈ సమయంలో కమలా హారీస్ అధ్యక్ష పదవిని అనర్హురాలంటూ ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 7:03 AM GMT
కమలా హారీస్  పౌరసత్వంపై బిగ్  ట్విస్ట్... ఏమిటీ 1857 కేసు..?
X

గతంలో ఎన్నడూ లేనంత విధంగా అన్నట్లుగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ఎన్నికల వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కిన పరిస్థితి. కమలా హారీస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తర ప్రచార పోరు నడుస్తుంది. ఈ సమయంలో కమలా హారీస్ అధ్యక్ష పదవిని అనర్హురాలంటూ ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... అత్యంత రసవత్తరంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతూ, ఎన్నో సంచలన విషయాలకు వేదికైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తాజాగా ఓ భారీ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... యూఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ (ఎన్.ఎఫ్.ఆర్.ఏ) అనే సంస్థ తాజాగా ఓ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... సహజ పౌరసత్వం ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవిని అర్హులని రాజ్యాంగం స్పష్తంగా చెబుతోందని.. ఈ లెక్కన చూసుకుంటే కమలా హారీస్ యూఎస్ అధ్యక్ష పదవికి అనర్హురాలంటూ ప్రచారం మొదలుపెట్టింది.

1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ ఫర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోందని ఎన్.ఎఫ్.ఆర్.ఏ. చెబుతోంది. ఈ తీర్పు ప్రకారం... కమలా హారిస్ తో పాటు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వంటి వారు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే అని చెప్పుకొస్తోంది. ఇంత కీలకమైన మౌలిక ప్రాతిపదకను డెమోక్రటిక్ పార్టీ తుంగలోకి తొక్కిందని విమర్శిస్తోంది.

ఎన్.ఎఫ్.ఆర్.ఏ. వాదన ఈ విధంగా ఉంటే... మరోవైపు పలువురు న్యాయ నిపుణులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇది రాజ్యాంగానికి వక్రభాష్యం చెప్పడమేనని మండిపడుతున్నారు. తల్లితండ్రులకు యూఎస్ పౌరసత్వం ఉందా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టేవారంతా ఈ దేశ పౌరులేనని 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ ఫర్ కేసు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు.

నిజంగా... ఇప్పుడు ఎన్.ఎఫ్.ఆర్.ఏ. వాదనను పరిగణలోకి తీసుకుని దాన్ని వర్తింపచేయాల్సి వస్తే బ్రిటీష్ మూలాలున్న తొలినాళ్ల ఆధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్, జేమ్స్ మాడిసన్ లు కూడా ఆ పదవికి అనర్హులే అవుతారని చెబుతున్నారు. కాగా... కమలా హారీస్ తల్లి భారతీయురాలు కాగా.. తండ్రి జమైకాకు చెందినవారనే సంగతి తెలిసిందే.

ఏమిటీ 1857 కేసు తీర్పు..?:

1857 కాలంలో అప్పట్లో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్తబద్ధత ఉండేది. ఈ సమయంలో తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్ స్కాట్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బానిస.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే... అందుకు నాడు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఇదే సమయంలో.. ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పరులే కాదని.. వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హత కూడా లేదని తెలిపింది. అయితే... ఈ తీర్పును పక్కనపెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా బానిసత్వాన్ని రద్దు చేయడమే కాకుండా.. జాతి భేదాలతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టినవారంతా దేశ పౌరులేనని చట్టం చేశారు.

దీంతో... ఈ విషయంలో 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ ఫర్ కేసులోని సుప్రీం తీర్పును మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లుగా ఎన్.ఎఫ్.ఆర్.ఏ. కావాలనే కమలా హారీస్ పై బురదజల్లుతున్నారంటూ పలువురు న్యాయనిపుణులు ఫైరవుతున్నారు. పాత తీర్పులే కాదు కొత్త మార్పులను గమనించాలని సూచిస్తున్నారు.