ట్రంప్ మీద కమల పైచేయి.. ఆగస్టు విరాళాలు ఎవరికి ఎక్కువంటే?
బరిలోకి వచ్చిన నాటి నుంచి తన గ్రాఫ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న కమలా.. తాజాగా ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Sep 2024 4:04 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార డెమొక్రాట్ల అభ్యర్థిగా భారత మూలాలు ఉన్న కమలా హారిస్ బరిలో ఉంటే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. కమలాకు ముందు బైడెన్ ను అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు ట్రంప్ దే పైచేయి అన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే కమలా హారిస్ రంగంలోకి దిగారో.. అప్పటినుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
బరిలోకి వచ్చిన నాటి నుంచి తన గ్రాఫ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న కమలా.. తాజాగా ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా మరో అంశం తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన విరాళాల సేకరణలో.. ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ ముందు ఉండటం గమనార్హం.
బయటకు వచ్చిన లెక్కల ప్రకారం ఆగస్టులో ట్రంప్ కంటే రెట్టింపు విరాళాలు కమలా హారిస్ కు రావటం విశేషం. తాజా పరిణామాల్ని చూస్తే.. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కమలా హారిస్.. ట్రంప్ నకు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా చెప్పాలి.
కమలా హారిస్ కు ఆగస్టులో 30 లక్షల మంది విరాళాలు అందజేశారు. ఆమెకు మొత్తం 36.1 కోట్ల డాలర్లు (మన రూపాయిల్లో సుమారు 3030 కోట్లు) విరాళాల రూపంలో అందాయి. ఈ సానుకూల పరిణామంతో మరింత ఉత్సాహంగా ఈ నెల (సెప్టెంబరు) న్యూయార్క్.. అట్లాంటా.. లాస్ ఏంజిల్స్.. శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాల్ని నిర్వహించేందుకు హారిస్ టీం ఏర్పాట్లు చేస్తోంది. కమలా హారిస్ తో పోలిస్తే ట్రంప్ వెనుకబడి ఉన్నారు.
ఆగస్టులో ఆయనకు కేవలం 13 కోట్ల డాలర్లు (మన రూపాయిల్లో సుమారు 1091 కోట్లు) మాత్రమే విరాళాల రూపంలో రావటం గమనార్హం. ట్రంప్ తో పోలిస్తే.. కమలాకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చినట్లుగా చెప్పాలి. ఆగస్టు నెలాఖరుకు కమలాహారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులు ఉంటే.. ట్రంప్ వద్ద మాత్రం కేవలం 295 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. నవంబరులో జరిగే ఈ ఎన్నికలు రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.