డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి మనమ్మాయే.. క్లారిటీ ఇచ్చేసిన కమలా
అంతేకాదు.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీద సంతకం చేసిన వైనాన్ని ఆమె షేర్ చేశారు.
By: Tupaki Desk | 27 July 2024 7:12 AM GMTఅనుకున్నదే.. అంచనా వేసిందే అయినప్పటికీ అధికారికంగా వెల్లడి కావాల్సిన అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మనమ్మాయి కమలా హారిస్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సమాచారాన్ని ఆమె అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మీద సంతకం చేసిన వైనాన్ని ఆమె షేర్ చేశారు.
నవంబరులోజరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాబలంతో నడిచే ప్రచారమే విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కమలా.. అధికారానికి అవసరమైన అన్ని ఓట్లను సాధించేందుకు క్రషి చేస్తానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఎంపిక చేయటం తెలిసిందే. అయితే.. ఆయన అనారోగ్య పరిస్థితులపై నెలకొన్న సందేహాలు.. విమర్శల కారణంగా ఆయన ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో తన వారసురాలిగా భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఆమె పేరుకు మద్దతు పెరిగింది. అయితే.. ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన ప్రముఖుల్లో ఒబామా ఉన్నారు. మొదట్లో మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా కమలా హారిస్ అభ్యర్థిత్వానికి తన మద్దతు ఉంటుందని స్పస్టం చేశారు. ఈ క్రమంలో ఆమెను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎక్స్ మాథ్యమంగా ఆమె తాజాగా వెల్లడించారు. దీంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతిమంగా పోటీ పడే వారెవరన్న విషయంపై స్పష్టత వచ్చేసింది. రిపబ్లికన్ల అభ్యర్థిగా ట్రంప్.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారీస్ ఖరారయ్యారు. అధ్యక్ష ఎన్నికల అసలు యుద్ధం ఇక షురూ అయినట్లే.