తాజా పోల్ సర్వేలో ట్రంప్ ను దాటేసిన కమలా
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి.
By: Tupaki Desk | 5 Aug 2024 11:30 AM GMTఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బరిలో ఉన్న వేళలో ఆయనకంటే మెరుగైన అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు. పలు సర్వేలు.. పోల్ ఫలితాలు ఆయనకు స్పష్టమైన అధిక్యతను కట్టబెట్టాయి. అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బైడెన్ స్థానంలో కమలా హారిస్ రంగంలోకి దిగటంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. మొన్నటివరకు ట్రంప్ నకు పోటాపోటీగా ఉన్న అధిక్యత స్థానే.. ఇప్పుడు ట్రంప్ ను దాటేసినట్లుగా తాజా పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీరి మధ్య పోటీ తీవ్రంగా ఉందంటున్నారు.
నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అభ్యర్థులు ఇద్దరు తమ అధిక్యతలను పెంచుకోవటానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన పోల్ సర్వేలో ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లుగా సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. మరో రోజులో ఆమె తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిని) ఎంపిక చేసుకోనున్నారు.
ఇంతకూ కమలా హారిస్ మద్దతు పెరగటానికి.. ట్రంప్ అధిక్యత తగ్గటానికి కారణాల్ని విశ్లేషిస్తే.. కమలా మీద ట్రంప్ నోరు పారేసుకోవటమే కారణమంటున్నారు. బైడెన్ మీద ఏ రీతిలో అయితే దూకుడుగా విమర్శలు సంధించారో.. అదే తీరును కమలా మీదా పారేసుకోవటం ఆయనకు నెగిటివ్ గా మారిందంటున్నారు. ఇక.. కమలా హారిస్ కు మద్దతు పలుకుతున్న మాజీ దేశాధ్యక్షుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తన మద్దతు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన మనమడు జాసన్ మీడియాకు వెల్లడించారు. 1977-81 మధ్యలో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.