Begin typing your search above and press return to search.

అధికారికం: అమెరికా అధ్యక్ష రేసులో మనమ్మాయ్

అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి డెమోక్రాట్ల అభ్యర్థిగా రేసులోకి వచ్చిన మనమ్మాయ్ కమలా హ్యారిస్.. అధ్యక్ష అభ్యర్థిగా తాజాగా ఖరారు అయ్యారు.

By:  Tupaki Desk   |   3 Aug 2024 6:04 AM GMT
అధికారికం: అమెరికా అధ్యక్ష రేసులో మనమ్మాయ్
X

అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి డెమోక్రాట్ల అభ్యర్థిగా రేసులోకి వచ్చిన మనమ్మాయ్ కమలా హ్యారిస్.. అధ్యక్ష అభ్యర్థిగా తాజాగా ఖరారు అయ్యారు. తాజా పరిణామంతో నవంబరు ఏడున జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో ఆమె పోటీ పడనున్నారు. ఇప్పటివరకు ఆమె రేసులో ఉన్నప్పటికీ.. పార్టీ అధికారికంగా ఖరారు చేయలేదు. తాజాగా ఆ పని కూడా పూర్తైంది.

తాజాగా పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చ్ వల్ రోల్ కాల్ లో ఆమె సాధించినట్లుగా పార్టీ డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హరిసన్ తాజాగా ప్రకటించారు. దీంతో ఆమె పేరును అధ్యక్ష నామినీగా ప్రకటించటం లాంఛనమని చెప్పాలి. డెలిగేట్ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే మెజార్టీ ఓట్లను కమలా సొంతం చేసుకున్నారు. భారత మూలాలు ఉన్న కమలా హారిస్ పేరు అనూహ్యంగా తెర మదకు రావటం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జోబైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని.. కమలాకు తన పూర్తి మద్దతు ప్రకటించటం.. దీనికి డెమోక్రాట్ ముఖ్యులు వంత పాడటంతో ఆమె అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. తాజాగా కీలక మైలురాయిని అధిగమించారు.

ఈ నెలాఖరులో కమలా హారిస్ కోసం ర్యాలీ చేపడతామని.. తమ బలాన్ని ప్రదర్శిస్తామని హరిసన్ చెబుతున్నారు. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వీలుగా డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ మొయిల్ ద్వారా ఓటింగ్ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. అధికారిక నామినేషన్ ఆగస్టు ఏడుతో ఖరారు కానుంది. నామినేషన్ కోసం ఇప్పటివరకు ఆమెకు పోటీలో దరిదాపుగా ఎవరూ లేరు. ఇక.. ఆమె తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఇప్పటివరకు ఎంపిక చేసుకోలేదు. ఈ ప్రక్రియను కూడా ఆమె త్వరలోనే పూర్తి చేయనున్నారు.

డెమోక్రాటిక్ అభ్యర్థిగా తాను ఖరారు కావటంపై కమలా హారిస్ స్పందించారు. ఇదెంతో గౌరవంగా ఆమె ప్రకటించారు. దేశం పట్ల ప్రేమతో.. ఉత్తమమైన దాని కోసం పోరాడే వ్యక్తులను ఒక్కటి చేయటమే తన ప్రచార ఉద్దేశమన్న ఆమె.. ‘‘మేం మా దేశాన్ని ప్రేమిస్తాం. వర్చువల్ ఓటింగ్ టైం ముగిసిన తర్వాత అధ్యక్ష నామినేషన్ ను అధికారికంగా అంగీకరిస్తాను. ఈ నెలలో చికాగోలో మేం సమావేశమవుతాం. అందరం ఒక్క తాటి మీద నిలబడతాం. ఈ చారిత్రాత్మక సంఘటనను వేడుక చేసుకుంటాం. అధ్యక్ష ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుంది’’ అంటూ ధీమాను వ్యక్తం చేశారు.