బై బై బైడెన్ ఖాయం.. నేడో, రేపో ప్రకటన.. కమలా హ్యారిస్ కమింగ్
అసలు అన్నిట్లోనూ ముందంజలో ఉండే అగ్ర రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
By: Tupaki Desk | 19 July 2024 6:05 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు చరిత్రలో ఎరుగని అనూహ్య పరిణామం దిశగా వెళ్తున్నాయి.. అధ్యక్ష బరిలో ఉన్న ఓ అభ్యర్థిపై ఏకంగా హత్యాయత్నం జరగడం.. మరో అభ్యర్థి కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో వైదొలగే పరిస్థితి తలెత్తింది. అసలు అన్నిట్లోనూ ముందంజలో ఉండే అగ్ర రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదంతా ఎందుకు వస్తున్నదంటే.. తాజాగా జరిగిన ఓ కీలక ఘటన కారణంగానే..
మాజీ అధ్యక్షుడూ వద్దన్నారా?
అమెరికాను 8 ఏళ్లపాటు పాలించాడు బరాక్ ఒబామా. ఆ సమయంలో ఉపాధ్యక్షుడు జో బైడెన్. అంతేకాదు.. ఒబామాకు మంచి స్నేహితుడు కూడా. తర్వాతి కాలంలో బైడెన్ అధ్యక్షుడు అయ్యారు. మరోసారి ఇప్పుడు పోటీకి నిలిచారు. కానీ, ఆయన అసమర్థత, వయోభారంతో వెనుకబడిపోయారు. ఈ క్రమంలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఒబామా సైతం మద్దతుగా నిలుస్తున్నారు. బైడెన్ గెలవడం కష్టమేనని.. పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని ఒబామా మిత్రుల వద్ద వ్యాఖ్యానించారనే కథనాలు వచ్చాయి. బైడెన్ అభ్యర్థిత్వంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోనే బైడెన్ అంతర్మథనంలో పడ్డారని చెబుతున్నారు. ఈ వీక్ ఎండ్ లోనే ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షు ఎన్నికలు నవంబరులో జరుగనున్నాయి. తాను గెలవలేనని బైడెన్ కు తెలిసిపోయింది. ఇదే మాట ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇక సొంత పార్టీ నుంచి కూడా డిమాండ్లు వస్తుండడంతో బైడెన్ తప్పుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంటోంది. డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు కూడా ఇదే విషయం చెబుతున్నట్లు మరో మీడియా తెలిపింది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్ కే ఫోన్ చేసి.. మీరు తప్పుకోండి అని కోరడం కలకలం రేపింది. అంతేకాక.. బైడెన్ వయసు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఏర్పడినట్లు సమాచారం.
క్వారంటైన్ ఎన్నాళ్లో..
అసలే 81 ఏళ్ల బైడెన్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికితోడు కొవిడ్ బారినపడ్డారు. డెలావర్ ఇంట్లో క్వారెంటైన్ లో ఉన్నారు. ‘‘తీవ్ర అనారోగ్యం కలిగితే అధ్యక్ష పోటీ నుంచి తప్పుకొంటా’’ అని ఇటీవల బైడెన్ చెప్పారు. ఇప్పుడు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాక.. శని, ఆదివారాల్లో ఆయన ప్రకటన చేయనునట్లు తెలుస్తోంది.
మన కమలాకే చాన్స్..?
బైడెన్ తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్లు అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారని అంటున్నారు. ఆమె ఇప్పటికే పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఉపాధ్యక్ష అభ్యర్థి ఎవరనేదానిపై కూడా ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వరుసగా మరోసారి ట్రంప్.. మహిళా అభ్యర్థిని ఎదుర్కొన్నట్లు అవుతుంది. 2016 సంవత్సరంలో ఆయన హిల్లరీ క్లింటన్ తో పోటీ పడి గెలిచారు.