Begin typing your search above and press return to search.

తెలుగు వర్సెస్ తమిళ్... కమలా హారిస్ కు భారత్ తో ఉన్న బంధం తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 4:46 AM GMT
తెలుగు వర్సెస్ తమిళ్... కమలా హారిస్ కు భారత్ తో ఉన్న బంధం తెలుసా?
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అటు మిత్రదేశాలు, ఇటు శత్రుదేశాలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలిగి 59ఏళ్ల కమలా హారిస్ కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు వర్సెస్ తమిళ అనే ఆసక్తికరమైన, సరదా చర్చ తెరపైకి వచ్చింది!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారని అంటున్నారు. ప్రధానంగా... ఆయనపై జరిగిన కాల్పుల ఘటన అనంతరం లెక్కలు మరింత మారిపోయాయని చెబుతున్నారు. ఆయన గెలుపు అవకాశాలు భారీగా పెరిగాయనే కామెంట్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో... ఎన్నికల బరినుంచి జో బైడెన్ వైదొలగడంతో పాటు కమలా హారిస్ కు మద్దతు పలికారు. దీంతో... డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడే అవకాశమున్న నేతల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారు. ఆమె పేరు ఖరారైతే తొలి ఆసియన్ అమెరికన్ నాయకురాలిగా ఆమె రికార్డ్ సృష్టిస్తారు. కారణం ఆమె తండ్రి.. ఇండియన్ అనే సంగతి తెలిసిందే.

తమిళనాడు నుంచి అమెరికాకు వెళ్లి సెటిల్ అయిన శ్యామలా గోపాలన్ హరీస్ కుమార్తె ఈ కమలా హరీస్. తమిళనాడు నుంచి యూఎస్ వెళ్లిన శ్యామలా గోపాలన్.. క్యాన్సర్ రీసర్చర్, సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ గా కాలిఫోర్నియాలో పనిచేసేవారు. అంటే కమలా హారీస్ తమిళ ఆడపడుచన్నమాట!

ఇక రిపబ్లికన్ పార్టీ విషయానికొస్తే... ఆ పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి తెలిసిందే. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ. అయితే.. ఆమె తండ్రి అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఆమె అక్కడే జన్మించింది. ఏది ఏమైనా.. ఉషా చిలుకూరు తెలుగు ఆడపడుచు!

దీంతో... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అటు తెలుగు ఆడపడుచు, ఇటు తమిళ ఆడపడుచు కీలక భూమిక పోషిస్తున్నారని.. ఒక రకంగా ఇది భారతీయులు సంతోషించడంతోపాటు, గర్వపడాల్సిన విషయమే అని అంటున్నారు! ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు వర్సెస్ తమిళ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

ఏది ఏమైనా... ప్రపంచ పటంపై భారతదేశ ముద్ర, ఈ దేశ ప్రస్థావన మాత్రం నిత్యం ఏదో మూల అంతర్జాతీయ మీడియాలో నానుతూనే ఉంటండటం గమనార్హం!!