Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్‌ ను ఏకంగా దానితో పోలుస్తూ స్టార్‌ హీరో వ్యంగ్యాస్త్రాలు!

తాజాగా నూ కమల్‌.. బీజేపీ ప్రభుత్వంపైన ఫైర్‌ అయ్యారు. కేంద్రం తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెటుపై సెటైర్లు పేల్చారు.

By:  Tupaki Desk   |   24 July 2024 10:48 AM GMT
కేంద్ర బడ్జెట్‌ ను ఏకంగా దానితో పోలుస్తూ స్టార్‌ హీరో వ్యంగ్యాస్త్రాలు!
X

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ జోరు మీదున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉన్నారు. గతేడాది విక్రమ్‌ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన కమల్‌ హాసన్‌.. ఈ ఏడాది కల్కితో మరో ధమాకా హిట్‌ కొట్టారు. కల్కి మొదటి పార్టులో ఆయన కొద్దిసేపే కనిపించినా రెండో పార్టులో కీలక పాత్ర పోషించబోతున్నారనే విషయం అర్థమైంది.

కాగా కమల్‌ హాసన్‌.. మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కమల్‌ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు స్థానంలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన నిరుత్సాహం చెందకుండా పార్టీని నడుపుతున్నారు.

ఇటీవల లోక్‌ సభ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యమ్‌ పోటీ చేయలేదు. డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇచ్చింది. మొదటి నుంచీ బీజేపీ వ్యతిరేక భావజాలంతో కమల్‌ హాసన్‌ నడుస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తరచూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్ర విమర్శానాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగానూ కమల్‌.. బీజేపీ ప్రభుత్వంపైన ఫైర్‌ అయ్యారు. కేంద్రం తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెటుపై సెటైర్లు పేల్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు. ‘ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కు శుభాకాంక్షలు. అతి త్వరలో ఇండియా బడ్జెట్‌ ను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు.

తద్వారా పరోక్షంగా త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని కమల్‌ జోస్యం చెప్పారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. ఇండియా బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని చెప్పడమే కమల్‌ ఉద్దేశమని అంటున్నారు.

‘ఎన్డీయే బడ్జెట్‌’ అని కమల్‌ సెటైర్లు సంధించారు. ఎన్డీయేలో ఉన్న టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలకే బడ్జెట్‌ లో అత్యధిక ప్రాధాన్యం దక్కింది. అందుకే కేంద్ర బడ్జెట్‌ ను కమల్‌ హాసన్‌ ‘‘ఎన్డీయే బడ్జెట్‌’’ గా అభివర్ణించారు. త్వరలో ‘ఇండియా బడ్జెట్‌’ వస్తుందని చెప్పడం ద్వారా దేశం అంతటికీ ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడం కమల్‌ ఉద్దేశమని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కమల్‌ ట్వీట్‌ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కొంతమంది కమల్‌ ట్వీట్‌ కు అనుకూలంగా పోస్టులు చేయగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు.

చాలా మంది నెటిజన్లు కమల్‌ హాసన్‌ను ట్రోల్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌ గురించి మాట్లాడటం కంటే ముందు తన సొంత ’ఇండియన్‌ 2’ సినిమా బడ్జెట్‌ వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

1996లో విడుదలై అఖండ విజయం సాధించిన ‘భారతీయుడు’కి సీక్వెల్‌ గా వచ్చిన ఇండియన్‌ –2 భారీ డిజాస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే.