కమల్ హాసన్ పోటీ ఈసారి ఇక్కడి నుంచే!
ప్రస్తుతం కమల్.. భారతీయుడు–2 సినిమా, విక్రమ్ కు సీక్వెల్ కూడా చేస్తున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2024 3:30 PM GMTప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల మీద విజయవంతంగా ప్రయాణిస్తున్నారు. గతేడాది ‘విక్రమ్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం కమల్.. భారతీయుడు–2 సినిమా, విక్రమ్ కు సీక్వెల్ కూడా చేస్తున్నారు.
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ముందు... ‘‘మక్కల్ నీది మయ్యమ్’’ పేరుతో కమల్ హాసన్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని రెండో పెద్ద నగరం.. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ 2.62 శాతం ఓట్లు సాధించింది.
ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పోటీ చేసింది. అయితే కమల్ హాసన్ లోక్ సభకు పోటీ చేయలేదు. పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ 3.78 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు కూడా కమల్ పార్టీ తరఫున గెలుపొందలేదు.
అయినప్పటికీ తాను స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ తరఫున కమల్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావం కూడా ప్రకటించారు.
మొదటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, బీజేపీ మతతత్వ రాజకీయాలపై కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు పలుమార్లు బీజేపీ శక్తుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు సైతం ఎదుర్కొన్నారు.
కమల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తానని వెల్లడించారు. ఈసారి ఓడే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా పార్టీ నిర్వాహకులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓడిపోవడం బాధాకరమని కమల్ వ్యాఖ్యానించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కోవై (కోయంబత్తూరు) స్థానం నుంచి పోటీ చేసి తప్పనిసరిగా గెలుపొందుతానని శపథం చేశారు.
ప్రస్తుతం కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కాంగ్రెస్–డీఎంకే కూటమిలో ఉంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కు దక్షిణ చెన్నై నియోజకవర్గం కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అక్కడి నుంచి కమల్ హాసన్ లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటన ముగించుకొని చెన్నై చేరుకొన్నాక వచ్చేవారం నియోజకవర్గాల కేటాయింపు విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో దక్షిణ చెన్నై ఎంపీగా డీఎంకేకు చెందిన తమిళచ్చి తంగపాండియన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.