Begin typing your search above and press return to search.

ఆ ఎస్ఐ మిస్..లేడీ కానిస్టేబుల్.. కంప్యూటర్ ఆపరేటర్ మరణం!

ఒక ఎస్ఐ ఆచూకీ లేకుండా పోవటం.. మరో స్టేషన్ లో పని చేసే లేడీ కానిస్టేబుల్.. మరో కంప్యూటర్ ఆపరేటర్ మరణించిన వైనం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 4:57 AM GMT
ఆ ఎస్ఐ మిస్..లేడీ కానిస్టేబుల్.. కంప్యూటర్ ఆపరేటర్ మరణం!
X

కామారెడ్డిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక ఎస్ఐ ఆచూకీ లేకుండా పోవటం.. మరో స్టేషన్ లో పని చేసే లేడీ కానిస్టేబుల్.. మరో కంప్యూటర్ ఆపరేటర్ మరణించిన వైనం సంచలనంగా మారింది. మిస్టరీగా మారిన ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. అసలేం జరిగిందంటే..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ ఐగా పని చేస్తున్నారు సాయికుమార్. బీబీ పేట ఠాణాలో కానిస్టేబుల్ గా వ్యవహరిస్తున్న శ్రుతి.. బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి మిస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు లభించాయి. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు అక్కడి చెరువులో గాలింపులు చేపట్టారు.

గంటల కొద్దీ వెతికిన తర్వాత అర్థరాత్రి వేళలో చెరువులో శ్రుతి.. నిఖిల్ డెడ్ బాడీలు లభించాయి. ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సింధుశర్మ రంగంలోకి దిగి.. ఈ మొత్తం ఘటనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పోలీసులు అతడి కోసం ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా బీబీ పేట పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్నట్లుగా స్టేషన్ లో చెప్పి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నమైనా తన కుమార్తె ఇంటికి రాకపోవటంతో శ్రుతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి మధ్యాహ్నమే వెళ్లినట్లు సిబ్బంది చెప్పటంతో ఆందోళనకు గురైన వారు వెంటనే ఉన్నతాధికారుల్ని సంప్రదించారు.

ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించిన వెంటనే.. ఆమె ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం చెరువులో గాలింపుచర్యలు చేపట్టిన అనంతరం ఆమెతో పాటు బీబీ పేటకు చెందిన నిఖిల్ సెల్ లభించింది.ఇద్దరి డెడ్ బాడీలు చెరువులో బయటపడ్డాయి. దీంతో.. అసలేం జరిగింది? ఎస్ఐ మిస్సింగ్ తో పాటు.. వీరిద్దరి మరణం వెనుక ఏమైనా కారణం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎస్ఐ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.