రఘురామ కేసులో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. విచారణకు రాలేనంటూ తులసిబాబు లేఖ
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది.
By: Tupaki Desk | 3 Jan 2025 8:56 AM GMTఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న కామేపల్లి తులసిబాబు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం తులసిబాబు విచారణకు రావాల్సివుండగా, వ్యక్తిగత పనుల మీద తనకు వీలు కాలేదని ఏడు లేదా ఎనిమిదో తేదీల్లో ఏదో ఒక రోజు వస్తానంటూ పోలీసులు లేఖ రాశాడు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉండగా, 2021 మే 14న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ కస్టడీలో ఉన్న తనపై భౌతకదాడి జరిగిందని రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తునకు ప్రకాశం ఎస్పీ దామోదర్ ను ప్రభుత్వం నియమించింది. కేసు విచారణలో భాగంగా రఘురామపై కొందరు ప్రైవేటు వ్యక్తులు దాడి చేసినట్లు గుర్తించారు. అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ వద్ద ప్రైవేటు సేవలు అందించిన తులసిబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు రమ్మంటూ ఎస్పీ దామోదర్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసుల ప్రకారం జనవరి 3వ తేదీ శుక్రవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయానికి తులసిబాబు హాజరుకావాల్సివుంది. అయితే తాను విచారణకు రాలేనని, 7, 8 తేదీల్లో తనకు సమయం ఇవ్వాలని తులసిబాబు లేఖ రాయడం సంచలనంగా మారింది.
తన గుండెలపై కూర్చొని భౌతిక దాడి చేసిన వ్యక్తిని తాను గుర్తు పడతానని, విచారణ సమయంలో తనను పిలవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు పోలీసులను కోరారు. కానీ, పోలీసులు ఆయనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదన తెలుస్తోంది. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రఘురామపై దాడి చేసిన కేసులో నిందితుడు టీడీపీ కార్యాలయంలో పనిచేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ కేసులో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో డాక్టర్ ప్రభావతి 5వ నిందితురాలిగా ఉన్నారు.