బీజేపీని కలిపింది చంద్రబాబు కాదు.. పవనే!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా, లేదా అని చివరి వరకు ఊగిసలాట కొనసాగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 April 2024 9:31 AM GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా, లేదా అని చివరి వరకు ఊగిసలాట కొనసాగిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరింది. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ఇష్టం లేదని.. బీజేపీ వాళ్లే చంద్రబాబును ఎన్డీయేలోకి ఆహ్వానించారని టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా చెప్పుకుంది. ఇప్పటికీ బీజేపీతో పొత్తుపై టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు సోషల్ మీడియాలో తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. పొత్తులో బీజేపీని కలిపింది చంద్రబాబు కాదని.. పవన్ కళ్యాణ్ అని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన వల్లే తనకు కైకలూరులో పోటీ చేసే అవకాశం దక్కిందన్నారు. వైఎస్ జగన్ దుర్మార్గ పాలనను ఆపడానికి పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదని.. నిజంగానే రియల్ హీరో అని కామినేని శ్రీనివాస్ కొనియాడారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ దుర్మార్గ పాలనను ఉండకూడదనే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానాలను తగ్గించుకున్నారని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ముందు జగన్ పాలన పోవాలని.. ఆ తర్వాత చూసుకోవచ్చని ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే తాను కైకలూరులో పోటీ చేస్తున్నానని, టీడీపీని, బీజేపీని ఆయనే కలిపారన్నారు. ఎన్ని స్థానాలు కావాలో అడగకుండా జైలుకెళ్లి పొత్తును ప్రకటించారని కొనియాడారు. నిజ జీవితంలో పవన్ హీరో అన్నారు. చంద్రబాబు, బీజేపీ కలిసేవారు కాదని.. పవన్ కళ్యాణ్ వల్లే ఈ కలయిక సాధ్యమైందన్నారు.
ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పొత్తుకు ముందు బీజేపీ సైతం చంద్రబాబుతో పొత్తుకు ఇష్టపడలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే బీజేపీ కోరుకుందని టాక్ నడిచింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా పవన్ పొత్తుకు ఒప్పించారు. ఇప్పుడు ఇదే విషయం కామినేని వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందని అంటున్నారు.
కాగా 2014లో టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు సీటు బీజేపీకి దక్కింది. దీంతో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్... వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ పై విజయం సాధించారు. అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2019లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణపై వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలిచారు.
కాగా 2014లో బీజేపీ తరపున గెలిచిన కామినేని శ్రీనివాస్ 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలోకి దిగారు. కేవలం 974 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.