కమ్మ నేతలు రగులుతున్నారా...!?
ఆ లెక్కన చూస్తే కమ్మ సామాజిక వర్గంలో అత్యధిక శాతం టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 18 Jan 2024 3:30 AM GMTఏపీలో కులాల సంకుల సమరం అన్నది తెలిసిందే. అంతే కాదు ప్రధాన రాజకీయ పార్టీలకు ఫలనా సామాజిక వర్గాలు అనుకూలంగా ఉంటాయని కూడా చెబుతూంటారు. నూటికి నూరు శాతం కాకపోయినా మెజారిటీ మాత్రం ఆయా కులాలు తాము సొంతం అని భావించుకునే పార్టీలకు మద్దతు ఇస్తూ ఉంటాయి. ఆ లెక్కన చూస్తే కమ్మ సామాజిక వర్గంలో అత్యధిక శాతం టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తోంది. ఇది దశాబ్దాలుగా ఉన్న విషయమే.
అయితే 2019లో వైసీపీకి కూడా కమ్మలలో కొంత శాతం మద్దతు దక్కింది. ఈసారి చూస్తే అటువంటి చీలిక కూడా లేకుండా గుత్తమొత్తంగా కమ్మలు అంతా టీడీపీ సైడ్ తీసుకుంటారు అన్న ప్రచారం ఒక వైపు ఉంది. అయితే టీడీపీకి ఇపుడు ఇబ్బంది వస్తోంది ఆ సామాజికవర్గం నుంచే కావడం విశేషం. 2019 తరువాత చూసుకుంటే వరసగా కమ్మలలో సీనియర్లు కీలక నేతలు ఆ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు.
దానికి వారు చెబుతున్న కారణం చంద్రబాబు చినబాబు పోకడలు అని. ఇక 2014 ఎన్నికలకు ముందే కొడాలి నాని టీడీపీని వీడివెళ్ళారు. ఆయన అన్న గారు పుట్టిన ప్రాంతం నుంచి వచ్చిన వారు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు అయిన వారు కొడాలి నాని. అలాగే 2019 తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరం అయ్యారు. ఈయన కూడా ప్రముఖ కమ్మ నేతగా బెజవాడ రాజకీయాల్లో ఉన్నారు.
ఇపుడు చూస్తే బెజవాడ ఎంపీ అయిన కేశినేని నాని టీడీపీకి దూరం అయి వైసీపీ చెంతన చేరారు. ఈ ముగ్గురూ చంద్రబాబుని లోకేష్ ని టార్గెట్ చేసినంతగా మరొకరు చేయలేదు. ఇంతటితో కధ ఆగిపోలేదు, గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి రంగారావు ఏకంగా చంద్రబాబు ఫోటోని విసిరికొట్టారు. చంద్రబాబును లోకేష్ ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇంకో వైపు చూస్తే తెనాలి సీటు విషయంలో చంద్రబాబుతో తేల్చుకోవాలని అక్కడి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా చూస్తున్నారు. టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ అంటున్నారు. దీనితో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అయితే ఏకంగా పార్టీకే దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధంగా లేనని చెప్పేశారు.
ఇక జనసేన పొత్తులతో సీట్లు పోయే వారిలో మరికొందరు నేతలు సీనియర్ కమ్మ నేతలు రగులుతున్నారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా అధినాయకత్వం పోకడల మీద ఫైర్ అవుతున్నారని అంటున్నారు.
అలాగే అనంతపురం అర్బన్ సీటుని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ హుళక్కి అయితే ఆయన కూడా ఫైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సీటు జనసేనకు ఇస్తారని ప్రచారంలో ఉంది. అదే జిల్లాకు చెందిన పరిటాల రవి ఫ్యామిలీ కూడా రెండు టికెట్లు అడుగుతోంది. అందులో ధర్మవరం టికెట్ ని పరిటాల రవి కుమారుడు శ్రీరాం ఆశిస్తున్నారు. అయితే టీడీపీని వదిలేసి బీజేపీలో చేరిన సూరిని రప్పించి టికెట్ ఇస్తానని అంటే శ్రీరాం కూడా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.
వీళ్లే కాదు క్రిష్ణా గుంటూరులలో అనేక మంది కమ్మ నేతలు కూడా టికెట్ రాకపోతే సహించేలా లేరు అని అంటున్నారు. జనసేనకు పొత్తులో ఎక్కువ సీట్లు ఇచ్చినా టీడీపీలో ఇబ్బంది వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి ఎన్నికలు టీడీపీకి కత్తి మీద సాముగా ఉంటే పార్టీలో ఒక బలమైన సామాజిక వర్గం నేతలు డైరెక్ట్ గానే తన బాధను వ్యక్తం చేస్తూండడం మాత్రం పార్టీకి కలవరపెడుతోంది అని అంటున్నారు.